పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గానూ మండల స్థాయి నాయకత్వంతో రేపు విజయవాడలో వైసీపీ సమావేశం నిర్వహిస్తొంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూల నుండి పార్టీ శ్రేణులు భారీగా హజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హజరయ్యే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్ లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు సహా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న వారు , పార్టీ అనుబంధ సంఘాల నేతలు హజరవుతారు.
ఇది పూర్తిగా ఆహ్వానితులతోనే జరుగుతున్న సమావేశమనీ, బహిరంగ సభ కాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మండల స్థాయిలో సంస్థాగతంగా అన్ని రకాలుగా లీడ్ చేయగలిగిన లీడర్ షిప్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటరాక్షన్ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయి నేతలు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో ఆయా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు క్యాడర్ సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి హజరయ్యే నేతలు పార్టీ అధినేత జగన్ ఆలోచనలు, ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని సజ్జల వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వారిగా, తర్వాత ఎన్నికల వరకూ జరిగే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో లీడ్ చేసే వారిగా నేతలకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని, వారికి చాలా అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
ఇప్పటి వరకూ సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్చిలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్ లతోనే సమావేశాలను నిర్వహించగా, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మండల స్థాయి పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాలతో తొలి సారిగా సమావేశం నిర్వహిస్తున్నారు.