తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు, మూడో స్థానాల కోసమే భారాస, కాంగ్రెస్‌లు పోటీ పడాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జహీరాబాద్ సెగ్మెంట్‌కు చెందిన భారాస నేత డి.వసంత్, ఇల్లందుకు చెందిన లకినేని సురేందర్‌లు భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీలు రవీందర్‌నాయక్, చాడ సురేశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, భారాసల పాలన చూశారు. ఈసారి భాజపాను గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఏనాడూ అమరవీరుల ఆకాంక్షలను గౌరవించలేదు. ఎన్నికల్లో భారాస డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగాలనే నమ్ముకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చే 50 రోజులు కష్టపడతాం’ అని తెలిపారు.
ఆదిలాబాద్ సభకు అమిత్‌షా
ఎన్నికల షెడ్యుల్ వెలువడిన తర్వాత మొట్టమొదటి భాజపా సభ మంగళవారం ఆదిలాబాద్‌లో జరగనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారన్నారు. సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులు, విద్యావంతులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడతారని తెలిపారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం మేడారంలోని సమ్మక్క-సారక్క దేవతల ఆశీర్వాదం కోసం గిరిజన మోర్చా ముఖ్యనేతలంతా వెళ్తున్నట్లు తెలిపారు.
ఖర్చు సంస్కృతి భారాసతోనే: ఈటల
‘ఎన్నికల్లో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతిని భారాసనే తీసుకొచ్చింది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీలో చేసే వ్యయంలో నాలుగో వంతు ఖర్చుపెడితే తెలంగాణలో సరిపోయేది. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గానికి రూ.50 కోట్లు వ్యయం చేసేందుకు భారాస సిద్ధమైంది. ఇప్పటికే రూ.15 కోట్ల చొప్పున చేర్చింది. భారాసకు ఓటేయకుంటే పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారు. బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యమవుతుంది’ అని ఈటల అన్నారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z