NRI-NRT

జికొండూరు చేరిన తెలుగు యువకుడి మృతదేహం

జికొండూరు చేరిన తెలుగు యువకుడి మృతదేహం

కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామమైన ఎన్‌టీఆర్‌ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్‌ అలియాస్‌ జోషీ (34) ఎంఎస్‌ చదివేందుకు 2018లో స్పెయిన్‌ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్‌ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు.

గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూ­డి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసు­కెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్‌ ఎంబ­సీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z