న్యూజిలాండ్ అదరగొట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాదాపు బ్యాటర్లందరూ భారీ స్కోరు సాధించారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో కివీస్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ 223 పరుగులకు ఆలౌటైంది. కోలిన్ అకెర్మాన్ (69; 73 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ (30), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (29), తేజ నిడమనూరు (21), మ్యాక్స్ ఔడెడ్ (16), విక్రమ్‌జిత్ సింగ్ (12), బాస్ డి లీడే (18) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ శాంటర్న్ (5/59) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ 3, రచిన్ రవీంద్ర ఒక వికెట్ పడగొట్టారు.
కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా.. ఇంగ్లాండ్‌పై భారీ శతకం బాదిన డేవాన్ కాన్వే (32) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రచిన్ రవీంద్ర (51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (53; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో మిచెల్ శాంట్నర్ (36*; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో స్కోరు 300 దాటింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వాన్ డెర్ మెర్వే రెండేసి వికెట్లు పడగొట్టారు. బాస్ డి లీడే ఒక వికెట్ తీశాడు.