WorldWonders

ఆ గ్రామంలోకి మగవాళ్లకి నో ఎంట్రీ!

ఆ గ్రామంలోకి మగవాళ్లకి నో ఎంట్రీ!

చాలాసార్లు మహిళలు అనుకుంటారు.. అసలు మగాళ్లు లేని ప్రపంచం కావాలి. కేవలం అమ్మాయిలే ఉండాలి అని. కానీ అలాంటి ఒక ఏరియా గర్స్‌ హాస్టల్స్‌, గర్స్‌ కాలేజీల్లో మాత్రమే కనిపిస్తుంది కదా.! ఒక ఊర్లో అసలు మగపురుగే ఉండదంటే.. అందరూ ఆడవాళ్లే. చూద్దాం అన్నా మీకు అక్కడ ఒక్క మగవ్యక్తి కనిపించరు. పురుషులకు ఆ గ్రామంలో ప్రవేశం లేదు. విచిత్రంగా ఉంది కదూ! ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది..? అక్కడ వాళ్లు ఎందుకు ఈ రూల్స్‌ పెట్టుకున్నారు..?

కెన్యాలో ఉమోజా అనే గ్రామం ఉంది. ఇది ప్రపంచంలోనే ఓ అసాధారణ గ్రామం ఇది. మగవాళ్లకు ఈ గ్రామంలో ప్రవేశం లేదు. శతాబ్దాలుగా ఇక్కడి స్త్రీలు ఎదుర్కొన్న హింస వల్ల ఇక్కడి ఈ సాంప్రదాయం మొదలైంది. ఆ గ్రామంలో స్త్రీలను అణచివేస్తున్న వాళ్లను ఎదుర్కొనే శక్తి అక్కడి మగవాళ్లలో లేకపోయింది.. ఈ సమాజంలో మగవారు స్వాతంత్య్రం, బలం పొందారు. కానీ, స్త్రీలు పొందలేకపోయారు. దీంతో మహిళలు అంతా కలిసి సొంత గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు, స్వచ్ఛమైన గాలి, అన్నీ ఉంటాయి. అక్కడ ఒక్కటి మాత్రమే లేదు అది పురుషులు. ప్రపంచంలో పురుషుల ప్రవేశం నిషేధించబడిన ఏకైక గ్రామం అది.

ఇక్కడ ప్రతి పనీ ఆడవాళ్ళే చేస్తారు అంటే ఒక విధంగా ఈ గ్రామాన్ని మహిళలే శాసిస్తారు. ఈ గ్రామం సుమారు 30 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇక్కడ నివసిస్తున్న మహిళలు శరణార్థులు. ఈ మహిళలందరూ మాసాయి సమాజంలో భాగంగా పరిగణించబడే సంబురు తెగలో చిన్న భాగం.

సంబురు మహిళలను వారి భర్తల ఆస్తిగా పరిగణిస్తారు. వారికి చాలా తక్కువ హక్కులు ఉన్నాయి. అనేక సార్లు ఈ స్త్రీలు వయసులో వారికంటే పెద్దవాళ్లను పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు వీరికి సున్తీ కూడా చేసేవాళ్లు. గృహ హింస ,లైంగిక వేధింపులకు కూడా గురయ్యారు. 1990లలో బ్రిటిష్ సైనికులు ఆ ప్రాంతంలోని మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని కొన్ని నివేదికలలో పేర్కొన్నారు. ఆ తర్వాత వారి భర్తలు వారిని అంగీకరించడానికి నిరాకరించారు. ఆ సమయంలో సంబురు గిరిజన మహిళలు దాదాపు 1400 మంది అత్యాచారానికి గురయ్యారట.

రెబెక్కా లోలోసోలి అనే మహిళ కూడా అదే హింసను అనుభవించింది. తన మాట ఎవరూ వినకపోవడంతో దాదాపు 15 మంది మహిళలతో కలిసి ఉమోజా అనే గ్రామాన్ని స్థాపించింది. ఉమోజ అంటే ఐక్యత. ఈ గ్రామంలో స్త్రీల మధ్య ఐక్యత ఉంటుంది. అందుకే ఇక్కడ పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు మహిళలు ,పిల్లలు మాత్రమే నివసిస్తున్న ఈ గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. మహిళలు సంప్రదాయ పూసల దండలు అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. గ్రామానికి సమీపంలో నివసించే పురుషులు తరచూ వారిని వేధించడానికి వారి పశువులను దొంగిలిస్తారు. కానీ అలాంటి చర్యలు ఆ స్త్రీల మనోస్థైర్యాన్ని తగ్గించవు. మహిళలు ఈ గ్రామ పరిపాలనను నిర్వహిస్తూ, డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారట. ఆ మహిళలు మంచి నిర్ణయమే తీసుకున్నారు. మగవాళ్ల చేతుల్లో చిత్రహింసలు అనుభవించడానికి కాదు కదా వాళ్లు జన్మించింది. ఈ గ్రామం నిజంగా ఎంతో మంది ఆడవాళ్లకు ఆదర్శం.