ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది.
ఉద్యోగులకు ఈ-మెయిల్…ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. “ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం” అని ఆ ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు.
లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్‌ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్‌లతో పోలిస్తే కొత్త రిక్రూట్‌మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది.