‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామాన్యుల ఉసురుతీస్తున్నది. 2017లో అమల్లోకి తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పేరిట సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నది. ఈ ప్రహసనంలో హిందువులు పరమ పావనిగా, సకల పాప హరణిగా కొలిచే ‘గంగా జలం’పై కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు ఇటీవల ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ప్యాకేజ్డ్ గంగ వాటర్, ఆన్‌లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ప్యాకేజ్డ్ గంగా జలంపై ఈ పన్ను వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.30కే ఇప్పటివరకూ లభిస్తున్న 250 మిల్లీలీటర్ల ‘గంగాజల్’, ‘గోముఖ్’ వంటి బ్రాండ్ గంగా జలం వాటర్ బాటిల్స్ ఇకపై రూ.35కు పెరుగనున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంపై సామాన్యులు మండిపడుతున్నారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో పూజా కార్యక్రమాల్లో వినియోగించే గంగా జలంపై పన్నును విధించడమేంటని నిలదీస్తున్నారు. ప్రజలను దోచుకోవడానికే కేంద్రం జీఎస్టీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యుడు తినాలా? వద్దా??
కోట్ల మంది పేదలు, మధ్యతరగతి జీవులకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి, పాల ఉత్పత్తులు, ప్రీప్యాక్డ్, ప్రీలేబుల్డ్ ఆహార ధాన్యాలు, చేపలు, పన్నీర్, తేనె, ఫ్రీజ్ చేయని మాంసం, చెక్కర, టీ పొడి ఇలా దాదాపు అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై 5% జీఎస్టీ విధించిన కేంద్రం.. పసిపిల్లలకు వాడే పాల పొడిపైనా జీఎస్టీని విధించింది. రోగమొచ్చి దవాఖానకు వెళ్లినా 5% పన్ను, విద్యార్థులు వాడే పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, ప్యాకేజ్డ్ బట్టర్, నెయ్యి, పండ్లరసాలు, హోటల్‌కు వెళ్లి తిందామంటే 12%, ఆరోగ్య బీమా చెల్లింపులపై 18% పన్నువాత పెట్టింది. 2017 నుంచి కిందటేడాది నవంబర్ వరకు జీఎస్టీ చట్టంలో కేంద్రం ఏకంగా 907 సవరణలు చేసింది.