ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం మార్చడం మరోసారి వాయిదా పడింది. ఆయన డిసెంబరులో మారబోతున్నారంటూ మరో అనధికారిక వార్త బుధవారం బయటకొచ్చింది. ‘పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం ఉంటా’ అని ముఖ్యమంత్రి ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీకాకుళం పర్యటనలో ప్రకటించారు. సెప్టెంబరులో ఆయన విశాఖకు మారలేదు. సెప్టెంబరు నెలాఖరులో జరిగిన మంత్రిమండలి సమావేశంలో దసరాకు సీఎం విశాఖకు మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ ప్రతినిధులు ఎంపిక చేసిన మీడియా ఛానళ్లకు లీకులు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి ‘విశాఖకు వందనం’ పేరుతో విశాఖపట్నంలో కార్యక్రమాలు ప్రారంభించి, దసరాకు సీఎం అక్కడికి వచ్చినపుడు ఘన స్వాగతం పలికేందుకంటూ ఒక ఐకాసను కూడా వైకాపా పెద్దలు వెనక ఉండి ఏర్పాటు చేయించారు. ఇంత హడావుడి చేసి, ఇప్పుడు సీఎం దసరాకు కాదు డిసెంబరులో వెళతారనే మరో వార్త బయటకొచ్చింది. డిసెంబరు 21న జగన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆ రోజన లేదా కొద్దిగా అటూఇటుగా విశాఖకు వెళతారనేది కొత్త వార్త సారాంశం. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన కేసుపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబరుకు వాయిదా వేసింది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసిన తర్వాతే.. సీఎం విశాఖకు వెళ్లడంపై స్పష్టత వస్తుందనే చర్చ కూడా మరోవైపు జరుగుతోంది.
👉 – Please join our whatsapp channel here