కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. 2024 జనవరికి సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ బుకింగ్ షెడ్యూల్‌ను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీడీప్ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 21న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
రూ.500, రూ.1000 వర్చువల్ సేవా టికెట్లు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయని చెప్పింది. జనవరి నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణం టిక్కెట్లు 23న ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ (బ్రేక్ దర్శనం) టికెట్లు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చేయనున్నట్లు టీటీడీ వివరించింది. 24న ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. జనవరి మాసానికి సంబంధించిన వసతి గదులకు ఈ నెల 25న 10 గంటలకు స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. తిరుపతిలో గదులను 25న, తిరుమలలో 26న విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.
👉 – Please join our whatsapp channel here