Sports

నరేంద్రమోదీ స్టేడియంపై దాడి చేస్తామంటూ బెదిరింపు

నరేంద్రమోదీ స్టేడియంపై దాడి చేస్తామంటూ బెదిరింపు

భారత్‌ కేంద్రంగా వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi stadium) వేదికగా పలు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేడియంపై దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన అధికారులు.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

దేశంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియమైన అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య అక్టోబర్‌ 14న మ్యాచ్‌ జరగనుంది. దీంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియాన్ని పేల్చేస్తాననంటూ ఓ వ్యక్తి అక్కడి అధికారులకు ఈ-మెయిల్‌ పంపించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అతడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందినవాడని.. ప్రస్తుతం అతడు రాజ్‌కోట్‌ శివారు ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఫోన్‌ నుంచే ఈ బెదిరింపు మెయిల్‌ పంపించినట్లు కనుగొన్నారు. అయితే, గతంలో అతడికి ఎటువంటి నేర చరిత్ర లేదని అహ్మదాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, అక్టోబర్‌ 14న జరగనున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో 11వేల మందితో భద్రతా ఏర్పాటు చేసినట్లు గుజరాత్‌ పోలీసులు వెల్లడించారు. నరేంద్రమోదీ స్టేడియం వద్ద స్థానిక పోలీసులతోపాటు ఎన్‌ఎస్‌జీ, ఆర్‌ఏఎఫ్‌, హోంగార్డులు ఇతర విభాగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z