ScienceAndTech

ఇక నుంచి నోటి క్యాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో గుర్తించవచ్చు

ఇక నుంచి నోటి క్యాన్సర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో గుర్తించవచ్చు

నోటి క్యాన్సర్లను గుర్తించే స్మార్ట్‌ఫోన్‌ను హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలోని ఐ-హబ్‌, ఐఎన్‌ఏఐ ప్రతినిధులు కనుగొన్నారు. ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ త్వరలో తెలంగాణలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. వీరి పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో నోటి కుహరం వద్ద ఫొటోలు తీస్తేచాలు.. ఫోన్‌లోని ఏఐ స్టాఫ్‌వేర్‌ క్యాన్సర్‌ ఉందా? లేదా? అనేది గుర్తిస్తుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉందా? చివరిదశకు చేరుకుందా? అన్న అంశాలనూ విశ్లేషిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రబలుతున్న నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే వేగంగా గుర్తించేందుకు ఇది దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బయాప్సీ అవసరం లేకుండానే నోటి కుహరంలో గాయాలు, చిన్న చిన్న కణితుల్లో రక్తస్రావం వంటివాటిని స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు తీయగానే.. ఏఐ విశ్లేషించి క్యాన్సర్‌ దశను తెలుపుతుందని తెలిపారు.

ఎలా పనిచేస్తుంది?
దీని వెనుక పరిశోధకుల విశేష కృషి ఉంది. బయోకాన్‌ ఫౌండేషన్‌, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారి, లేనివారి నోటి కుహర ఫొటోలు తీశారు. బయాప్సీ చేస్తే క్యాన్సర్‌ కచ్చితంగా ఉందని చెప్పే లక్షణాలున్న ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. వైద్య నిపుణులు వివేక్‌ తల్వార్‌, ప్రజ్ఞాసింగ్‌ల సూచనలతో ఆయా ఫొటోల్లో మార్పులు, చేర్పులు చేసి ఒక డేటాబేస్‌ను రూపొందించారు. ఇలా నిక్షిప్తం చేసిన రెండు వేలకుపైగా ఫొటోలను ఏఐ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించారు. ఈ డేటాబేస్‌లోని ఫొటోలతో.. కొత్తగా నోటి కుహరంలో తీసిన ఫొటోలను అనుసంధానిస్తే వాటి విశ్లేషణ ద్వారా సాఫ్ట్‌వేర్‌.. గ్రేడింగ్‌లను ఇస్తుంది. క్యాన్సర్‌ను గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందో నిర్ధరిస్తుంది. అలాగే క్యాన్సర్‌ నియంత్రణకు స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరం కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి నిర్వహించడం కొంత కష్టమే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌తో విస్తృతంగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా చాలామందిలో క్యాన్సర్‌ ముప్పును తప్పించవచ్చని ఐఎన్‌ఏఐ సీఈవో కోనల వర్మ తెలిపారు.