DailyDose

పవన్ మూడు పెళ్లిళ్లపై జగన్ ఫైర్- తాజా వార్తలు

పవన్ మూడు పెళ్లిళ్లపై జగన్ ఫైర్- తాజా వార్తలు

* ఆ రెండు పార్టీలు ఒకటే:కేఏ పాల్‌

తెలంగాణలో భారాస కుటుంబ అక్రమ, అవినీతి పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) విమర్శించారు. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న భారాస మద్దతుదారులను గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లను భారాస నుంచి నుంచి రాజీనామా చేయించి కాంగ్రెస్‌లో చేర్పించారని అన్నారు.తెజస, వైతెపాలను కూడా కాంగ్రెస్‌ వాడుకుంది. నవంబర్‌ 30న కేసీఆర్‌కి గుడ్‌బై చెప్పాలంటే.. ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాలి. ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు. 60శాతం ఉన్న బీసీలకు 60శాతం సీట్లు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా. పోటీ చేయాలనుకున్న వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్‌పే చేసి, దరఖాస్తు పంపండి. భారాస, కాంగ్రెస్‌ ఒక్కటే. కేసీఆర్‌పై 7 కేసులు వేశాను. దీంతో కేటీఆర్‌ నాపై దాడి చేయించారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. టికెట్ల కోసం అన్ని కులాల వారు ఎవర్నీ అడగొద్దు. ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉంది. వారం రోజుల్లోగా జాబితా విడుదల చేస్తాం. భారాస ఇస్తున్న పథకాలన్నింటికీ రెండు రెట్లు ఇస్తాం. పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటి వరకు 3600 మంది దరఖాస్తు చేశారు’’ అని కేఏ పాల్‌ అన్నారు.

* పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని YSRTP అధినేత్రి షర్మిల నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. పాలేరుతో పాటు మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పారు. తన తల్లి, భర్త కూడా పోటీ చేయాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో YSRTP అభ్యర్థులు పోటీ చేస్తారని, బీఫాంల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

* పవన్ మూడు పెళ్లిళ్లపై జగన్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లపై సీఎం వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వేదిక ఏదైనా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు అని మూడు పెళ్లిళ్లు అంటూ సీఎం జగన్ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అయితే కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదాబాద్ అని… కానీ ఆయన ఇల్లాలు మాత్రం మూడేళ్లకో, నాలుగేళ్లకో ఒకసారి మారుతుందంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసిందేనంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని సీఎం జగన్ ప్రత్యేకంగా విమర్శలు చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్ కల్యాణ్ భార్యలను ఉద్దేశిస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ ప్రస్తావించారు. ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవమని ఆరోపించారు. వివాహ వ్యవస్థపై పవన్ కల్యాణ్‌కు గౌరవం లేదని ధ్వజమెత్తారు. ప్యాకేజీ స్టార్‌కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ విమర్శలు చేశారు.జనసేన పార్టీపైనా..జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యవహార శైలిపైనా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ సొంత పార్టీని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామంటూ మండిపడ్డారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్‌గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సొంతపార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారి అని పవన్ కల్యాణ్‌పై జగన్ విమర్శలు చేశారని మండిపడ్డారు.రెండు షూటింగ్‌ల మధ్య అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి పోతుంటారని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.

* గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు నోటీసులు

బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు(Rajasthan police) నోటీసులు జారీ చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే వెల్ల‌డించారు. బ్యాంకు అకౌంట్ల‌తో పాటు ఆర్థిక లావాదేవీల‌కు చెందిన స‌మాచారాన్ని ఇవ్వాల‌ని రాజ‌స్థానీ పోలీసులు కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజ‌కీయ క‌క్ష‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. జోధ్‌పూర్‌లోని ఇంటికి నోటీసులు ఇచ్చార‌ని, త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డం ఇదే తొలిసారి అని, అంత‌కుముందు త‌న‌కు ఎటువంటి నోటీసులు రాలేద‌ని ఎంపీ షెకావ‌త్ తెలిపారు. సంజీవ‌ని క్రెడిట్ కోఆప‌రేటివ్ సొసైటీలో మంత్రి గ‌జేంద్ర పాత్ర ఉన్న‌ట్లు సీఎం గెహ్లాట్ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌స్థాన్ పోలీసుల‌కు చెందిన స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ గ్రూపు ఈ కేసును విచారిస్తున్న‌ది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, రాజ‌కీయ కుట్ర‌తో త‌న ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం గెహ్లాట్‌పై కేంద్ర మంత్రి ప‌రువున‌ష్టం కేసును దాఖ‌లు చేశారు.

* రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్, ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిపై కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది.దాదాపు రేపు అభ్యర్దుల జాబితా ఖరారు కానున్నది. చివరి నిముషంలో మరికొన్ని చేరికలుండే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధులను “కేంద్ర ఎన్నికల కమిటీ” ఖారారు చేసినా, “బస్సు యాత్ర” తర్వాతే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14 తర్వాత మరికొన్ని చేరికలు ఉంటాయి. దాదాపు ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రేపటి “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్.పి నాయకుడు భట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే హాజరు కానున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. 4 స్థానాలు తప్ప.. బీజేపీ ఈనెల 16న ప్రకటించే అవకాశముంది.

* పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి చురకలు

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహార తీరుపై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు. ‘‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు.’’ అంటూ దుయ్యబట్టారు.ఒక ఫేక్‌ ఎగ్రిమెంట్‌తో స్కిల్‌ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్‌ అని సీమన్స్‌ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ ఎగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది! ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది.’’ అని పేర్కొన్నారు.సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా రూట్‌ చేశారో స్వయంగా బాబు పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

* సుప్రీంకోర్టులో నవాబ్‌ మాలిక్‌కు ఊరట

మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 11న రెండు నెలల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే, చికిత్స తీసుకున్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ బేలా ఎం త్రివేది, దీపాంకర్‌ దత్తా ధర్మాసనం బెయిల్‌ను పొడిగించింది.అయితే, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మధ్యంతర బెయిల్ పొడిగింపును వ్యతిరేకించలేదు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో లింకున్న కేసులో ఆయ‌న మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్పడినట్లు ఆరోప‌ణ‌లు ఉండగా.. ఈడీ అరెస్టు చేసింది. మాలిక్‌ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన తరఫున న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉందని తెలిపారు. అయితే, కోర్టు మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కోర్టు బెయిల్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

* తెలంగాణలో దసరా పండగల సెలవులు

తెలంగాణలో దసరా పండగల సెలవులు ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ. బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 తేదీ వరకు సెలవులు ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీకి వెల్లడించింది.ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అక్టోబర్ 14 వ తేదీ నుంచి 24 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. UG,PG కాలేజీల విద్యార్థులు దసరా, బతుకమ్మ సెలవులు వర్తిస్తాయి. 10 రోజుల సెలవుల అనంతరం ఓయూ క్యాంపస్ తో పాటు..ఓయూ అఫిలియేటడ్ కాలేజీలన్నీ తిరిగి అక్టోబర్ 25వ తేదీన తెరబడతాయని పేర్కొంది.మరోవైపు దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 23 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* కాలి నడకన తిరుమలకు లియో డైరెక్టర్

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు తమిళనాడు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన లోకేశ్‌.. అభిమానులతో ముచ్చటించారు. పలువురితో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మారాయి. తన సినిమా విజయం అందుకోవాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.లియో’లో హీరోయిన్​గా త్రిష నటిస్తుండగా.. అర్జున్‌ సర్జా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ దాస్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్‌ అజయ్‌

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Hamas) యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో (Israel) చిక్కుకున్న భారతీయులను (Indians) క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించేందుకు ‘ఆపరేషన్‌ అజయ్’ను (Operation Ajay) ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం (Special Flight) నేడు దేశానికి చేరుకోనుందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 20 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని చెప్పారు.కాగా, తమ రాష్ట్రానికి చెందిన 7 వేల మంది ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యంచేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు (Foreign Minister S Jaishankar) లేఖ రాశారు. తమిళనాడుకు చెందినవారు 80 మంది అక్కడ చిక్కుకుపోయారని సీఎం స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో యుద్ధ భూమిలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z