సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన బిజీబిజీగా సాగుతోంది. గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌కు చేరుకున్న ఆయన.. ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడి మహాశివుడి ఆలయంతోపాటు పార్వతీకుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మోదీ పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా పార్వతీకుండ్ ఒడ్డున ఉన్న శివపార్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శంఖాన్ని పూరించారు. తలపాగా, రంగా (పై వస్త్రం)తో కూడిన సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆది కైలాస పర్వత శిఖరానికి అభిముఖంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. ఈ క్రమంలో మోదీకి స్థానిక పూజారులు వీరేంద్ర కుటియాల్, గోపాల్ సింగ్‌లు తోడుగా ఉన్నారు.
అనంతరం అక్కడి నుంచి సరిహద్దుల్లోని గుంజీ గ్రామాన్ని మోదీ సందర్శించారు. స్థానికులతోపాటు భద్రతా సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించారు. స్థానిక వస్తుప్రదర్శనను తిలకించారు. సమీపంలోని జగేశ్వర్ ధామ్‌లోని శివాలయ సందర్శనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కుమావుమ్ ప్రాంతంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చివరగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
👉 – Please join our whatsapp channel here