రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ (High Cholesterol Levels) పెరగడం గుండె పోటుకు ముప్పు కారకంగా వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కొందరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుండె పోటు, స్ట్రోక్ ఘటనలు పెరుగుతూ ప్రాణాంతక పరిస్ధితిని కొనితెచ్చుకుంటున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు ముఖ్యంగా స్టాటిన్స్ వాడకంపై అపోహలతో నష్టం వాటిల్లుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హై కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో రక్తంలో కొవ్వుతో కూడిన వ్యర్ధాలు రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఈ వ్యర్ధాలు పెద్దవిగా అయినా, చీలినా గుండెపోటు, స్ట్రోక్ వంటి ఘటనలు ప్రాణాంతకంగా మారతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో స్టాటిన్స్ సమర్ధవంతంగా పనిచేస్తాయని నిరూపణ అయింది. దీంతో ఆయా వ్యక్తులు హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పుకు గురయ్యే అవకాశం గణనీయంగా తగ్గుతుంది.
రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌ను వెనక్కిమళ్లించడంతో పాటు రక్తనాళాల గోడల్లో పేరుకుపోయిన కొవ్వులో చీలికలను నివారించడంలోనూ స్టాటిన్స్ సమర్ధవంతంగా పనిచేస్తాయని వెల్లడైంది. స్టాటిన్స్ వాడకంతో ఆరంభంలో కండరాల నొప్పుల వంటి స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా ఆపై సర్దుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, నిత్యం పొగ తాగే అలవాటున్నవారు వైద్యుల సూచనలకు అనుగుణంగా స్టాటిన్స్ రోజూ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here