ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వంధ్యాత్యం సమస్య పెరుగుతోందని, ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని నిపుణులు సూచించారు. దీని పరిష్కారానికి వారు ఒక మార్గసూచీని రూపొందించారు. ఈ పరిశోధన బృందానికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు. వీరు చేసిన ముఖ్య సూచనలివీ..
తాము తండ్రి కాలేకపోవడానికి కారణాలను తెలుసుకొని, తదనుగుణంగా చికిత్సలు పొందే హక్కు బాధితులకు ఉంటుంది. అయితే నిధులు, సరైన పరిశోధనలు, ప్రామాణిక చికిత్సల కొరత వంటి కారణాల వల్ల ప్రస్తుతం చాలామందికి ఉపశమనం దక్కడంలేదు.
పురుషులు, వారి భాగస్వాములు, సంతానానికి సంబంధించిన కణజాలాలు, క్లినికల్ డేటాతో ప్రపంచస్థాయి ‘బయోబ్యాంక్’ ఏర్పాటు చేయాలి. సంతానలేమికి జన్యు, పర్యావరణ కారణాల గురించి తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది.
ఎప్పటికప్పుడు జన్యు క్రమాలను ఆవిష్కరించడం, మెరుగైన వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.
నిత్యం వాడే ఉత్పత్తుల్లో ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీసే రసాయనాలు పురుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకునేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి. పని ప్రదేశం, వాతావరణపరమైన అంశాలు ఇందుకు కారణమవుతున్నాయా అన్నది పరిశీలించాలి.
పురుషులు, మగపిల్లలను హానికర రసాయనాల నుంచి రక్షించడానికి విధాన నిర్ణయాలు అవసరం. ఈ పదార్థాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను గుర్తించాలి. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా పురుషులను ప్రోత్సహించాలి. ఈ దిశగా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
👉 – Please join our whatsapp channel here