Movies

గాడ్‌ మూవీ రివ్యూ

నయనతార గాడ్‌ మూవీ రివ్యూ

నటీనటులు : జయం రవి, నయనతార, నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి తదితరులు..
హీరో: జయం రవి
హీరోయిన్ : నయన తార
డైరెక్టర్ : ఐ. అహ్మద్
ప్రొడ్యూసర్ : సుధన్ సుందరం, సతీష్ కుమార్, జయరామ్
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజ
రిలీజ్ డేట్: 13 oct

తెలుగువాడైన జయం రవి తమిళంలో మంచి సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు. పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలతో కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఆయన హీరోగా నటించిన ఇరైవన్ అనే సినిమా గత నెల 28వ తేదీన తమిళంలో రిలీజ్ అయింది. పూర్తిస్థాయి సైకోథ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కీలకపాత్రలో నటించడంతో అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇక ఈ సినిమాని తెలుగులో గాడ్ పేరుతో అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

గాడ్ సినిమా కథ విషయానికి వస్తే
అర్జున్ (జయం రవి) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి భయం అర్ధమే తెలియదు. నేరాలు చేసే వారి ఆట కట్టించడమే ఏకైక లక్ష్యంగా పనిచేసే ఆయనకు సొంత కుటుంబం ఉండదు. తన స్నేహితుడైన మరో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అండ్రు(నరేన్) కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావిస్తూ డ్యూటీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉంటాడు. ఒకానొక దశలో ఆండ్రు సోదరి ప్రియ (నయనతార)తో ప్రేమలో పడినా సరే తన దూకుడు వ్యక్తిత్వం వల్ల ఎప్పుడు చనిపోతానో తెలియదు కాబట్టి ఆమెకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో వీరికి స్మైలీ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) ఒక సవాలుగా మారతాడు. ఎంతో కష్టపడే అతన్ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ ప్రాణాలు కోల్పోగా ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పి రిజైన్ చేసి కాఫీ షాప్ పెట్టుకుంటాడు అర్జున్. అయితే అరెస్ట్ అయిన బ్రహ్మ జైలు నుంచి తప్పించుకోవడమే కాక ఈసారి అర్జున్ సన్నిహితులైన అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ బ్రాహ్మను మరోసారి పట్టుకున్నాడా? బ్రహ్మ జైల్లో ఉండగానే బ్రహ్మ తరహాలోనే హత్యలు చేసింది ఎవరు? చివరికి బ్రహ్మ ఆగడాలు అర్జున్ ఎలా అడ్డుకట్ట వేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథగా చెప్పుకోవాలి అంటే ఈ గాడ్ సినిమా కథ కొత్త కథ ఏమీ కాదు. వరుస హత్యలు చేసే ఒక సీరియల్ సైకో కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి దిగిన పోలీస్ అధికారులు ఎలా అతన్ని ట్రేస్ చేసి ఈ హత్యలు మొత్తానికి ముగింపు పలికారు అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ గాడ్ సినిమా కూడా పూర్తిస్థాయిలో అదే కథతో వచ్చిన సినిమా. కాకపోతే గతంలోని సినిమాలన్నీ ఒక రకమైన స్క్రీన్ ప్లేతో సాగితే ఇది మాత్రం పూర్తిగా హీరో జయం రవి వెర్షన్ లో సాగింది.. ఆ సినిమాలకు దీనికి అదొక్కటే మార్పు. నిజానికి తమిళంలోనే ఇలాంటి సైకో కిల్లర్ సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా రాక్షసన్, పోర్ తోజిల్ వంటి సినిమాలు మంచి హిట్లు కూడా అందుకున్నాయి. నిజానికి ఇలాంటి సైకో థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అయితే సదరు కిల్లర్ ఎందుకు సైకోగా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో క్లారిటీగా చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అలాంటి వారికి ఒక గతం ఉంటుంది, ఆ గతాన్ని కచ్చితంగా ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి గతాలేవి చెప్పే ప్రయత్నం చేయలేదు. హత్యలు జరుగుతున్న తీరు ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించే విషయంలో శ్రద్ధ తీసుకున్న దర్శకుడు అసలు ఎందుకు సైకో కిల్లర్ ఇలాంటి హత్య చేస్తున్నాడు? అది కూడా 25 ఏళ్ల అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? వంటి విషయాలను మాత్రం ఎందుకో రివీల్ చేసేందుకు ఇష్టపడలేదనిపించింది. కొన్ని లోపాలు పక్కన పెట్టి చూస్తే సినిమా కొంతవరకు ఆకట్టుకుంటుంది. కానీ ఒకానొక దశలో మర్డర్ సీన్లు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. స్క్రీన్ ప్లే పర్వాలేదు కానీ నిడివి తగ్గించి మరింత క్రిస్పీగా ఉండేలా కనుక రాసుకుని ఉంటే ఇంకా ఆసక్తికరంగా ఉండేది. అలాగే పోలీసులు సైకో కిల్లర్ ను పట్టుకునే క్రమాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే నటీనటుల విషయానికి వస్తే అసలు ఏమాత్రం జాలీ దయా కరుణా లాంటివి లేని పోలీసు అధికారి పాత్రలో జయం రవి లీనమైపోయాడు. ఆయనకు పోలీసు అధికారి పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ సినిమాలో కూడా ఒకరకంగా పోలీసు అధికారిగా జీవించేశాడు అంతే. అయితే లేడీ సూపర్ స్టార్ గా చెప్పుకునే నయనతార ఎందుకో ఈ సినిమాలో చాలా చిన్న పాత్రకే పరిమితం అయిపోయింది. ఆమె పాత్ర ఉన్న తీరు చూస్తే ఇది ఎప్పుడో గతంలో చేసిన సినిమా ఏమో అనిపిస్తుంది కానీ 2022 తర్వాత చేసిన సినిమానే. సైకో కిల్లర్ పాత్రలో రాహుల్ బోస్ ఒక రేంజ్ లో నటించాడు. సైకోయిజం చూపిస్తూ వామ్మో నిజంగా సైకోలు ఇలానే ఉంటారా అనిపించేలా చేశాడు. నరేన్ కి చిన్న పాత్ర అయినా ఉన్నంతవరకు బాగానే నటించాడు. ఇక ఆశిష్ విద్యార్థి సహా మిగతా నటీనటులు రెండో సైకో కిల్లర్ పాత్రలో నటించిన నటుడు ఆకట్టుకునే విధంగా తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు హత్యల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కేసు సాల్వ్ చేసే వైనం మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. సైకో కిల్లర్ స్వయంగా తాను హత్యలు చేశానని ఒప్పుకోవడం బాగానే ఉంది, కానీ అసలు ఎందుకు చేస్తున్నాననే విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. తెలుగులో డబ్బింగ్ చేసే విషయంలో కొంత కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమాలో సంగీతానికి పెద్దగా స్కోప్ లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం కాస్త భయపెట్టే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.. ఆ విషయంలో యువన్ శంకర్ రాజా తన మార్కు వేసుకునే ప్రయత్నం చేశాడు.. ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత వర్క్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా డార్క్ థీమ్ కి తగ్గట్టుగా ప్రేక్షకుల మైండ్ సెట్ ని సినిమా మీద పూర్తిగా ఫోకస్ చేసేలా చేయడం సక్సెస్ అయ్యారు.

ఫైనల్లీ: థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చే ‘గాడ్’

రేటింగ్స్: 2.75