ScienceAndTech

ఐన్‌స్టీన్‌ సిద్ధాంతంపై సుప్రీం కోర్టులో పిటిషన్

ఐన్‌స్టీన్‌ సిద్ధాంతంపై సుప్రీం కోర్టులో పిటిషన్

డార్విన్, ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. అయితే ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కోర్టు ఏం చేయగలదు? అని ధర్మాసనం ప్రశ్నించింది. మీరే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించుకోవాలని సూచించింది. ఆ పిల్‌ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని పేర్కొంటూ తిరస్కరించింది.

ఐన్‌స్టీన్ సాపేక్షత సమీకరణ సిద్ధాంతం E = mc², మనిషి జీవన పరిణామానికి సంబంధించిన డార్విన్ సిద్ధాంతాన్ని సవాల్‌ చేస్తూ రాజ్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను స్కూల్‌, కాలేజీలో చదివిన ఈ సిద్ధాంతాలు తప్పని పిల్‌లో పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని ఆరోపించాడు. డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మి లక్షలాది మంది చనిపోయారని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు సిద్ధాంతాలు తప్పని నిరూపించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరాడు.

న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్‌షు ధులియాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిల్‌పై విచారణ జరిపింది. ఈ సిద్ధాంతాలు తప్పని భావిస్తే వాటిని మెరుగుపర్చాలని పిటిషనర్‌కు సూచించింది. ఇందులో కోర్టు ఏం చేస్తుందని ప్రశ్నించింది. ‘సైన్స్‌ స్టూడెంట్‌ను, స్కూల్లో ఏదో చదివానని అంటున్నావు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలు తప్పని అని అంటున్నావు. చాలా ఏళ్ల నాటి ఆ సిద్ధాంతాలు తప్పని అని నువ్వు నమ్మితే దానికి సర్వోన్నత న్యాయస్థానం ఏమి చేస్తుంది? ఆర్టికల్ 32 ప్రకారం మీ ప్రాథమిక హక్కుకు ఏం ఉల్లంఘన జరిగింది?’ అని ప్రశ్నించింది. ‘నువ్వు నీ సొంత థియరీని ప్రతిపాదించుకుని ప్రచారం చేసుకో’ అని సూచిస్తూ ఆ పిల్‌ను కొట్టివేసింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z