ఒక పోలీస్ అధికారి ఫాంటసీ గేమింగ్ యాప్ (Fantasy Gaming App) లో రూ.1.5 కోట్లు గెలిచాడు. బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పి చిక్కుల్లో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి ఆన్‌లైన్‌లో జూదం ఆడటంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి చించ్‌వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండే ప్రముఖ ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్ 11లో రూ. 1.5 కోట్లు గెలిచాడు. ఆ డబ్బు ఆయన బ్యాంకు ఖాతాలో జమవుతున్నది.
కాగా, ఎస్‌ఐ సోమనాథ్ జెండే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రూ.1.5 కోట్లు గెలిచిన తాను ఆ డబ్బు రాదని తొలుత భావించినట్లు మీడియాతో అన్నారు. అయితే గురువారం రెండు లక్షలు తన ఖాతాలోకి బదిలీ అయ్యాయని చెప్పారు. ఇందులో రూ.60,000 మినహాయించి రూ.1.40 లక్షలు అందినట్టు తెలిపారు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానని అన్నారు. అలాగే మిగతా సగం డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతానని, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.
మరోవైపు ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ సోమనాథ్ ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా? ఈ గేమ్ చట్టబద్ధమేనా? ఇలా వచ్చిన డబ్బు గురించి మీడియాతో మాట్లాడవచ్చా? ఇదంతా నిబంధనల పరిధిలోకి వస్తాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ బాధ్యతను డీసీపీ స్వప్నా గోర్‌కు అప్పగించినట్లు పింప్రి చించ్వాడ్ ఏసీపీ సతీష్ మానే తెలిపారు. రిపోర్ట్ అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –