Business

అధిక సంఖ్యలో భారతీయుల ఖాతాలను నిషేధించిన ఎక్స్‌

అధిక సంఖ్యలో భారతీయుల ఖాతాలను నిషేధించిన ఎక్స్‌

ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్‌) పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25 మధ్య మొత్తం 5,59,439 ఖాతాలను నిషేధించింది. నిషేధానికి గురైన ఖాతాలన్నీ భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. కంపెనీ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

‘భారత్‌లోని యూజర్ల నుంచి మొత్తం 3,076 ఫిర్యాదులను స్వీకరించాం. ఖాతా సస్పెన్షన్‌లపై అప్పీల్‌ చేసిన 116 ఫిర్యాదుల్ని ప్రాసెస్‌ చేశాం. వాటిలో పరిశీలన అనంతరం 10 ఖాతాలు మినహా మిగిలిన ఖాతాల్ని తాత్కాలికంగా నిలిపివేశాం’ అని కంపెనీ తెలిపింది. వచ్చిన ఫిర్యాదుల్లో వేధింపులు (1,076), ద్వేషపూరిత ప్రవర్తన (1,063), పిల్లలపై లైంగిక దాడి (450), అడల్ట్‌ కంటెంట్ (332).. వంటి అంశాలకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1,675 ఖాతాలను తొలగించినట్లు ఎక్స్‌ తెలిపింది.

సెప్టెంబర్‌లో నిషేధించిన మొత్తం ఖాతాల్లో 5,57,764 ఖాతాలు చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేవిగానూ, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని ఎక్స్‌ తెలిపింది. అంతకుముందు జూలై 26 నుంచి ఆగస్టు 25 మధ్య భారత్‌లోని 12.80 లక్షల ఖాతాలను ఎక్స్‌ నిషేధించింది. జూన్ 26 నుంచి జూలై 25 మధ్య ఏకంగా 18.51లక్షల ఖాతాలను ఎక్స్‌ నిషేధించింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z