తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్యంపై విజయవాడ ఏసీబీ కోర్టులో శనివారం సాయంత్రం హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. సిద్ధార్థలూథ్రా, గింజుపల్లి సుబ్బారావు ఆన్‌లైన్‌లోనే వాదనలు వినిపించారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని కోరారు. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు .. వైద్యుల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జైలులో ఆయనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబును పరీక్షించిన వైద్యులు.. ఆయన ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్టు గుర్తించారు. ఈనెల 12న సాయంత్రం 4.30గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 నుంచి 5.30గంటల వరకు పరీక్షించి.. జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యల బృందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు. కానీ, జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ చెబుతూ వచ్చారు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో.. టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.