ScienceAndTech

తెల్ల భాస్వరం ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌

తెల్ల భాస్వరం ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌

(వైట్‌ ఫాస్పరస్‌)తో తయారైన మందుగుండు వాడినట్లు వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. వీటిని గాజాతోపాటు లెబనాన్‌పైకీ ప్రయోగించినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌ వాచ్‌ అనే సంస్థ పేర్కొనగా.. ఇజ్రాయెల్‌ సైన్యం ఖండించింది. నిబంధనలకు విరుద్ధంగా పలు దేశాల సైన్యాలు ఈ రసాయనాన్ని వాడుతున్నాయి. అయితే దీన్ని ప్రమాదకరం కాని రీతిలోనే ఉపయోగిస్తున్నట్లు బుకాయిస్తున్నాయి.

ఏమిటీ రసాయనం?

తెల్ల భాస్వరం ప్రమాదకర రసాయనం. ఆక్సిజన్‌ తగిలినప్పుడు ఇది మండుతుంది. ప్రాణవాయువు నిండుకునేవరకూ లేదా ఈ రసాయనం ఖాళీ అయ్యేవరకూ దాని ప్రజ్వలన కొనసాగుతుంది. ఈ మంటలను ఆపడం చాలా కష్టం. పైగా చాలా వేగంగా మండుతుంది. ఇది 800 డిగ్రీల సెల్సియస్‌ వేడిని కలిగిస్తుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద లోహాలూ కరిగిపోతాయి. ఇది మంటలు, దట్టమైన పొగను ఎక్కువ దూరం వ్యాప్తిచేయగలదు. ఈ లక్షణాల దృష్ట్యా అనేక దేశాల సైన్యాలు దీన్ని.. యుద్ధంలో పొగ తెరను సృష్టించేందుకు ఉపయోగిస్తున్నాయి. ఆ తెరమాటున శత్రువును బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ పొగ ఏడు నిమిషాల పాటు గాల్లో ఉంటుంది. ఈ రసాయనం వెల్లుల్లి తరహా వాసనను కలిగిస్తుంది.

ప్రయోగం ఎలా?

శతఘ్ని గుళ్లు, బాంబులు, రాకెట్లు, గ్రెనేడ్ల ద్వారా తెల్ల భాస్వరాన్ని శత్రువుపైకి ప్రయోగించొచ్చు.

ఐరాస ఏం చెబుతోంది?

పౌర ఆవాసాలున్న ప్రాంతాల్లో తెల్ల భాస్వరాన్ని ప్రజ్వలన కోసం ప్రయోగించడం ఐరాస సంప్రదాయ ఆయుధాల ఒప్పందం కింద నిషిద్ధం. అయితే పొగ తెర సృష్టించడానికి లేదా దీని మంటల ద్వారా యుద్ధంలో సంకేతాలు పంపుకోవడానికే ఈ రసాయనాన్ని వాడుతున్నట్లు ఆయా దేశాలు చెబుతున్నాయి.

శరీరంపై ఎలాంటి ప్రభావం?

తెల్ల భాస్వరం వల్ల కలిగే మంటలతో కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.

దీని పొగను పీల్చడం వల్ల శ్వాసపరమైన ఇబ్బందులు వస్తాయి.

తెల్ల భాస్వరం మంటలు చర్మాన్ని పూర్తిగా కాల్చేస్తాయి.

శరీరంలోకి ఈ రసాయనం ప్రవేశిస్తే కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి కీలక అవయవాల్లో ఇబ్బందులు కలగొచ్చు. ఇవి తెల్ల భాస్వరం వల్ల తలెత్తినట్లు వైద్యులు గుర్తించి, సరైన చికిత్స అందించకుంటే అవయవ వైఫల్య ముప్పునకు దారితీయవచ్చు.