కెనడాలో నివాసం ఉంటున్న భారత పౌరులకు ఊరట కల్పించేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ తల్లిదండ్రులతో మరింత కాలం గడిపేందుకు వెసులుబాటు కల్పించింది. కెనడాలో ఎక్కువ కాలం పాటు తమతో పాటే నివాసం ఉండేలా సూపర్ వీసా నిబంధనలన సులభతరం చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
కెనడా పౌరులు, కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న వ్యక్తులు తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్యలు తాత్కాలికంగా నివసించేందుకు ఉద్దేశించిన వీసానే ఈ సూపర్ వీసా. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు తమ పిల్లలు, మనవళ్లతో కెనడాలో నివాసం ఉండొచ్చు. అనేకసార్లు వచ్చీ వెళ్లొచ్చు. అయితే, గతంలో ఒకసారి ప్రవేశానికి 2 ఏళ్లు మాత్రమే గరిష్ఠంగా నివాసం ఉండేందుకు వీలుండేది. దాన్ని తాజాగా ఐదేళ్లకు పెంచారు.
సాధారణంగా విజిటర్ వీసా మీద వస్తే గరిష్ఠంగా ఆరు నెలలు మాత్రమే నివాసం ఉండేందుకు వీలుంటుంది. ఎక్కువ కాలం పాటు ఉండాలంటే ఈ వీసాను పొడిగించుకోవాలి. పైగా మళ్లీ ఫీజులు చెల్లించాలి. అలా కాకుండా దీర్ఘకాలం పాటు ఉండేందుకు సూపర్ వీసా ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామి తల్లిదండ్రులు, వారి గ్రాండ్‌పేరెంట్స్‌ను కూడా ఆహ్వానించొచ్చు. అయితే, కెనడాలో నివాసం ఉండేవారికి హెల్త్ ఇన్సురెన్స్ తప్పనిసరి. అలాగే, నివాసం ఉండే వ్యక్తుల కనీస అవసరాలను తీర్చగలిగే ఆర్థిక సామర్థ్యం ఉందని నివాసం కల్పించే వ్యక్తి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.