DailyDose

జగన్ కు సవాల్ విసిరిన పురందేశ్వరి-తాజా వార్తలు

జగన్ కు సవాల్ విసిరిన పురందేశ్వరి-తాజా వార్తలు

* జగన్ కు సవాల్ విసిరిన పురందేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుపై ఉన్నకేసులు కోర్టుల్లో ఉన్నాయని.. వాటిపై మాట్లాడితే సబ్ జుడిస్ కిందకు వస్తుందని అన్నారు.నారా లోకేష్‌ను అమిత్ షా పిలిచారా? లేదా అమిత్ షాను కలవాలని లోకేష్ అడిగారా? అనేది అప్రస్తుతమని పురందేశ్వరి అన్నారు. అమిత్ షా, లోకేష్ భేటీ జరిగిందని చెప్పారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారని.. ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని తెలిపారు. కిషన్ రెడ్డి పిలిచినట్టుగా లోకేష్ అన్నారని.. దాని గురించి ఆయననే అడగండి అని పరందేశ్వరి అన్నారు.గోదావరి జలాలను పెన్నాతో లింక్ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని పురందేశ్వరి విమరశించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గోదావరి-పెన్నా ప్రాజెక్టు డీపీఆర్ చూపించి రూ. 2 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. ఇది దారుణం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఏదైనా ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ ఎంక్వైరీ వేయించారని.. ఇప్పుడు ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద జగన్ సీబీఐ విచారణ కోరగలరా? అని సవాల్ విసిరారు.

రేవంత్ పై పొన్నాల ఫైర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేశారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా అని సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి నా బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసుకోవాలని సూచించారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ మల్కాజిగిరి పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారని ప్రశ్నించారు. ఐకమత్యమే పార్టీ బలమని.. ఈ విషయం రేవంత్ రెడ్డి మర్చిపోయారని మండిపడ్డారు. తనను అసెంబ్లీ ఎన్నికలో ఓడియారని అంటున్నారు.. మరీ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌లో ఓడిపోయారు కదా అని నిలదీశారు. ఇక, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారని.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు రావాలని కోరారని పొన్నాల తెలిపారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై రేవంత్ రెడ్డిగా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. పార్టీలో అన్ని పదవులు అనుభవించి.. చచ్చేముందు పార్టీ మారడం ఏంటని తీవ్ర విమర్శలు చేశారు.

 టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై బొత్స ఆగ్రహం 

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారి అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు వుంటే కోర్టుకు విన్నవించుకోవాలన్నారు. చంద్రబాబు అనారోగ్యంగా వున్నారని ఆయన కుటుంబసభ్యులకు అనిపిస్తే కోర్టుకు విన్నవించుకోవాలని ఫైర్ అయ్యారు. జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారని.. ఆయన ఇప్పుడు ఆధారాలతో దొరికిపోయారని బొత్స దుయ్యబట్టారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబుకు అనారోగ్యమని మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంగా వుండాలనే కోరుకుంటామన్నారు. చంద్రబాబుకు అనారోగ్యంగా వుంటే కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులే ఫోన్లు చేయిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. జిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీయేనని ఆయన దుయ్యబట్టారు. 

ఉప్ప‌ల్‌లో కాంగ్రెస్‌కు షాక్

 ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఏఎస్ రావు నగ‌ర్ కార్పొరేట‌ర్ శిరీష సోమ‌శేఖ‌ర్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌నున్నారు. పార్టీలో సీనియ‌ర్ల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదంటూ సోమ‌శేఖ‌ర్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ్రేట‌ర్ ప‌రిధిలో రేవంత్ రెడ్డికి సోమ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య అనుచ‌రుడిగా కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు సోమశేఖ‌ర్ రెడ్డి. ఉప్ప‌ల్ టికెట్ ల‌భించ‌ని నేప‌థ్యంలో సోమ‌శేఖ‌ర్ రెడ్డి ఆదివారం రాజీనామా చేయ‌నున్నారు.ఇప్ప‌టికే మ‌ల్కాజ్‌గిరి డీసీసీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీధ‌ర్, పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. నందికంటి శ్రీధ‌ర్ మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, పొన్నాల జ‌న‌గామ టికెట్ ఆశించారు. వీరిద్ద‌రికి ఎమ్మెల్యే టికెట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీకి రాజీనామా చేశారు.

ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన  కవిత

 గ్రూపు-2 క్యాండిడేట్ ప్రవళిక ఆత్మహత్యపై స్పందిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కవిత రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దు. మేము బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాము.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?, నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా?.కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. చివరికి గ్రూప్-2ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్‌లో డిమాండ్ చేయలేదా? శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్: ఎర్రబెల్లి 

బీఆర్ఎస్ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో  విలేకర్ల సమావేశంలో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్  కామెంట్స్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డి.. మొదటి నుండి ఆయన గుణం అదే అన్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాని తెలిపారు. కేటీఆర్ బాత్ రూం లు కడిగేదని అంటవ..? గోడల మీద రాతలు రాసుకొనే బ్రతుకు నీది.సంవత్సరానికి ఒక పార్టీ మారే వ్యక్తివి నీవు…కొండంగల్ లో చిత్తుచిత్తు ఓడిస్తే, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేశావ్… దమ్ముంటే రంగారెడ్డి నుంచి పోటీ చేయి.. నువ్వు రెండు సార్లు, పొన్నాల రెండు సార్లు ఓడిపోయారు, కానీ పొన్నాలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పెట్టినప్పటి నుంచి ఘోరంగ పడిపోతుంది.. 15 న బిఆర్ఎస్ పార్టీ మ్యానిపెస్టో విడుదల అవుతుంది…ఆ తర్వాత కాంగ్రెస్ మొత్తం పడిపోతుంది అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీలోకి వస్తే ఇంటికి వెళ్లి మరి స్వాగతిస్తాం అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

రేపు సీఎంను క‌లిసి తుది నిర్ణ‌యం: పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించార‌ని, రేపు సీఎంను క‌లిసి త‌ర్వాత తుది నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య పేర్కొన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం పొన్నాల‌ ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్‌ వెళ్లారు. ఈ సమావేశం ముగిసిన అనంత‌రం పొన్నాల ల‌క్ష్మ‌య్య మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ వ‌చ్చి త‌న‌ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించార‌ని పొన్నాల లక్ష్మ‌య్య తెలిపారు. ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు రావాల‌ని కేటీఆర్ కోరారు. రేపు కేసీఆర్‌ను క‌లిసిన త‌ర్వాత వివ‌రాలు తెలియ‌జేస్తాన‌ని తెలిపారు. రేవంత్ రెడ్డి మాట‌లు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా? అని ప్ర‌శ్నించారు. త‌న బ్యాక్‌గ్రౌండ్ ఏంటో రేవంత్ తెలుసుకోవాల‌ని సూచించారు. పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవ‌ల‌ను క‌నుమ‌రుగు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెల‌వ‌లేదు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో రేవంత్ త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎన్ని సీట్లు గెలిచార‌ని ప్ర‌శ్నించారు. ఐక‌మ‌త్య‌మే పార్టీ బ‌లం.. ఈ విష‌యం రేవంత్ మ‌ర్చిపోయారు. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు క‌దా? అని పొన్నాల ల‌క్ష్మ‌య్య నిల‌దీశారు.

బతుకమ్మ వేడుకల్లో జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. అటు ఆడవాళ్లు..ఇటు ఆడవాళ్లు కూర్చోని ఉండగా..మధ్యలో కూర్చున్న మంత్రి జగదీష్ రెడ్డి.. బతుకమ్మను పేర్చారు. మహిళలు ఒక్కో పువ్వు అందిస్తుండగా..అందంగా..పువ్వులను వరుసలో పేర్చి..బతుకమ్మను తయారు చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా సూర్యాపేటలోని తన నివాసంలో సతీమణి సునీత, ఇతర మహిళలతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పేర్చారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఆడుతుండగా..వారి మధ్యలో మంత్రి జగదీష్ రెడ్డి నిల్చున్నారు. ఆయన్ను కూడా చప్పట్లు కొట్టాలని మహిళలు రిక్వెస్ట్ చేయగా..సున్నితంగా తిరస్కరించారు. 

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z