వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టులో బాబర్ అజామ్ (50) అర్ధశతకం సాధించగా.. మహమ్మద్ రిజ్వాన్ (49), అబ్దుల్లా షఫిఖ్ (20), ఇమామ్ ఉల్ హక్ (36) మాత్రమే కాస్త పరుగులు సాధించారు. మిగతా వారిలో సౌద్ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4), షాదాబ్ ఖాన్ (2) ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.
వారిద్దరు కాసేపే..
తొలి వికెట్‌కు అబ్దుల్లా-ఇమామ్ 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వీరి జోడీని సిరాజ్ విడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికి ఇమామ్‌ను అద్భుతమైన డెలివరీతో హార్దిక్ బోల్తా కొట్టించాడు. అయితే, భారత్‌పై మంచి రికార్డు ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ – రిజ్వాన్ క్రీజ్‌లోకి పాతుకుపోయేందుకు ప్రయత్నించారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దీంతో 29 ఓవర్లలో పాక్ 150/2తో స్కోరు నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న వీరిని మళ్లీ సిరాజే దెబ్బ కొట్టాడు. అర్ధశతకం పూర్తి చేసిన బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
154/2 నుంచి 191/10
బాబర్ అజామ్‌ను ఔట్ చేసిన తర్వాత భారత బౌలర్లు మరింత చెలరేగిపోయారు. ఒకే ఓవర్‌లో షకీల్, ఇఫ్తికార్‌ను కుల్‌దీప్ పెవిలియన్‌కు పంపారు. తొలుత షకీల్‌ను ఎల్బీ రూపంలో.. ఆ తర్వాత ఇఫ్తికార్‌ను కుల్‌దీప్ బౌల్డ్ చేశాడు. మరికాసేపటికే కీలకమైన రిజ్వాన్‌ను, షాదాబ్ ఖాన్‌ను తన వరుస ఓవర్లలో బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను పాక్ కోల్పోయింది. మహమ్మద్ నవాజ్ (4), హసన్ అలీ (12) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. దీంతో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో ఉన్న పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు.
👉 – Please join our whatsapp channel here