తెలంగాణ భవితకు భరోసా ఇచ్చేలా భారాస మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ నేత, ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. మేనిఫెస్టోతో భారాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన మేనిఫెస్టో ఇది. కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా. సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారారు. తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మేనిఫెస్టో ఇది. పింఛన్లు, రైతు బంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యాన్ని నింపింది. హైదరాబాద్‌లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మేనిఫెస్టో ఇది. అగ్రవర్ణ పేద విద్యార్థులకు గురుకులాల ద్వారా అత్యుత్తమ విద్య అందుతుంది. అసైన్డ్ ల్యాండ్‌పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మేనిఫెస్టో ఇది. సీపీఎస్ ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలను ఈ మేనిఫెస్టో నెరవేరుస్తుంది.
ఇది భారాస మేనిఫెస్టో మాత్రమే కాదు.. ప్రజల మేనిఫెస్టో. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాండించే మేనిఫెస్టో. తొమ్మిదన్నరేళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలు కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే భారాస మేనిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే.. ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో భారాస హ్యాట్రిక్ కొట్టబోతోంది.. రికార్డు సృష్టించబోతున్నది’’ అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.