NRI-NRT

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటానని బైడెన్‌ తాజాగా ప్రకటన

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటానని బైడెన్‌ తాజాగా ప్రకటన

ఇజ్రాయెల్‌పై (Israel) హమాస్‌ (Hamas) ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులతో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) అన్నారు. హమాస్‌ దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ మేరకు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్విటర్‌(ఎక్స్‌)లో పోస్టు పెట్టారు. గత వారంలో హమాస్‌ దాడులు ప్రారంభం కాగానే ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని బైడెన్‌ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను శత్రువులెవరూ ఉపయోగించుకోవద్దని ఆ సందర్భంలో హెచ్చరించారు. అప్పటి నుంచి హమాస్‌తో పోరాడటానికి బైడెన్‌ సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ సైతం తన ఇజ్రాయెల్‌ పర్యటనలో ఇదే విధమైన మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో భేటీ పూర్తయిన తరువాత ‘అమెరికా ఉనికిలో ఉన్నంతకాలం మేము మీ వైపే ఉంటామని’ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ హమాస్‌తో పోరాడేందుకు యూఎస్‌ తమ రెండో నావల్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ను పంపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు అసోసియేట్‌ ప్రెస్‌ నివేదికను బట్టి తెలుస్తోంది. ‘యూఎస్‌ఎస్‌ డ్వైట్‌ డి ఐసన్‌ హోవర్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌’ను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపనున్నారు. అమెరికన్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ ‘యూఎస్‌స్ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’ ఇప్పటికే ఇజ్రాయెల్‌ సమీపంగా వెళ్లింది. భూ, వాయు, సముద్ర మార్గాల గుండా ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బైడెన్‌ తాజాగా ప్రకటన చేశారు.

గాజాలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వీలుగా గాజా పౌరులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఇది వరకే సూచించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు, ముఖ్యంగా గాజా పౌరులకు అత్యవసరంగా అవసరమైన మానవతా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జో బైడెన్‌ పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌కు తెలిపారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ సైతం యుద్ధం విస్తరించకుండా మధ్యప్రాచ్యంలో దౌత్య చర్చలు చేస్తున్నారు. గాజా స్ట్రిప్‌, ఇజ్రాయెల్‌ పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని పలు దేశాధినేతలను కోరుతున్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z