* అత్యంత ఖరీదైన పెన్ను ఇదే
ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు.అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు.ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్‌తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది.
* రాబోయే రోజుల్లో ఈవీల కోసం ప్రత్యేక వేదిక
సంప్రదాయ ఇంజిన్, విద్యుత్ ప్రయాణికుల వాహనాల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్లాట్‌పామ్‌లను ఏర్పాటు చేస్తామని టాటా మోటార్స్ (TATA Motors) తెలిపింది. తద్వారా భవిష్యత్ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. అలాగే సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌లపై ఈవీ (Electric Vehicles)లను అభివృద్ధి చేయడం వల్ల తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు మార్గం సుగమమవుతుందని డిజైన్ విభాగాధిపతి మార్టిన్ ఉహ్లారిక్ తెలిపారు.విద్యుదీకరణ, కనెక్టివిటీ వేగంగా ఊపందుకుంటున్న నేపథ్యంలో సౌలభ్యాన్ని కోరుకుంటున్నారని మార్టిన్ తెలిపారు. భవిష్యత్‌లో కార్ల లోపలి భాగాన్ని ఒక ఇంటి తరహాలో మార్చాల్సి ఉంటుందన్నారు. సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌పై ఈవీలను డిజైన్ చేయడం వల్ల దూరం, బ్యాటరీ లేఅవుట్ విషయంలో వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాట్‌ఫామ్‌లను విభజించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పరిశ్రమలో ప్రారంభమైందన్నారు. టాటా మోటార్స్ ఈవీలైన నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను సంప్రదాయ ఐసీఈ ప్లాట్‌ఫామ్‌లపైనే రూపొందించారు.గత సంవత్సరం టాటా మోటార్స్ (TATA Motors) సరికొత్త విద్యుత్ వాహన ఆర్కిటెక్చర్‌ను ఆవిష్కరించింది. దీని మీదే 2025 నుంచి పలు అధునాతన EVలను డిజైన్ చేయాలని యోచిస్తోంది. ‘అవిన్య (AVINYA)’ పేరిట తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్‌పై తయారు చేసిన తొలి మోడల్ 2025లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ‘కర్వ్ (CURVV)’ను సైతం గత ఏడాది పరిచయం చేసింది.
* 16ఏళ్ల వయసులో బిజినెస్
పాతికేళ్ళు దాటినా.. ఇప్పటికీ జీవితంలో ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. కానీ 16ఏళ్ల అమ్మాయి ఏకంగా రూ. 100 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి చేత ఔరా అనిపించుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రాంజలి అవస్థి’ (Pranjali Awasthi) అనే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి Delv.AI అనే స్టార్టప్ ప్రారంభించి ఏఐ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈమెకు ఇప్పటికే 10 మందితో కూడిన ఒక టీమ్ కూడా ఉండటం గమనార్హం. ప్రాంజలి వ్యాపారం అభివృద్ధి కావడానికి ఆమె తండ్రి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఏడు సంవత్సరాల వయసులోనే కోడింగ్ ప్రారంభించింది. అయితే ప్రాంజలి 11ఏళ్ల వయసులోనే వారి కుటుంబం ఇండియా నుంచి ఫ్లోరిడాకు మారింది. ఆ తరువాత 13ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. చాట్‌జీపీటీ ప్రారంభమైన మొదట్లోనే డెల్వ్.ఏఐ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తన వ్యాపార ప్రయాణం ప్రారంభించింది.ప్రాంజలి అవస్థి వ్యాపారానికి మద్దతుగా ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈమె కంపెనీ 450000 డాలర్ల నిధులను (రూ.3.7 కోట్లు) సేకరించగలిగింది. కాగా మొత్తం కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం.
* భారత్‌లో కోల్ ఇండియాలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం
2035 నాటికి అంతర్జాతీయంగా బొగ్గు పరిశ్రమలో 4 లక్షల మందికి పైగా గనుల తవ్వకం (మైనింగ్) ఉద్యోగాలు కోల్పోతారని అమెరికాకు చెందిన ఎన్‌జీఓ – గ్లోబల్ ఎనర్జీ మానిటర్ నివేదిక వెల్లడించింది. అంటే రోజుకు సుమారు 100 మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. వాతావరణ వాగ్దానాలు (క్లైమేట్ ప్లెడ్జెస్), బొగ్గును దశల వారీగా నిర్మూలించాలన్న విధానాలు లేకున్నా చైనా, భారత్‌లు అధికంగా దెబ్బ తినే అవకాశం ఉందని పేర్కొంది. చౌకగా లభించే పవన, సౌర విద్యుదుత్పత్తికి విపణి మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. చైనాలోని షాన్షి ప్రావిన్స్‌లో 2050 నాటికి అత్యధికంగా 2,41,900 ఉద్యోగ కోతలు ఉండొచ్చని నివేదిక తెలిపింది. భారత్‌లో కోల్ ఇండియాలో 73,800 ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 4,300 క్రియాశీల, ప్రతిపాదిత బొగ్గు గనులు, ప్రాజెక్టుల సమ్మిళితంగా అంతర్జాతీయ బొగ్గు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా బాధ్యత వహిస్తున్నాయని నివేదిక వివరించింది.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.ఇక మేలో ముడిచమురు ధరలు దిగొచ్చినా.. నష్టాల్ని పూడ్చుకొని ఆయిల్ కంపెనీలు లాభాల్లోకి వచ్చాయి. కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.
* భారీగా పెరిగిన ధరలు
దేశంలో ఈరోజు (అక్టోబర్ 14) బంగారం ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన రక్షణగా, ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని చూస్తున్న నేపథ్యంలో దేశంలో పసిడికి అత్యంత డిమాండ్ ఉంటోంది. దేశంలోని ప్రసిద్ధ జువెలర్స్ అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1400, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1530 పెరిగింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ. 55,400లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1530 పెరిగి రూ.60,440 లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు రూ. 54,000, రూ.58,910 లుగా ఉండేవి.
* నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు
ప్రతినెల ఒకటో తేదీన దేశంలోని ముడి చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల రేట్లను తగ్గిస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది.ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో మోదీ సర్కార్ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.హైదరాబాద్ : రూ. 966, వరంగల్ : రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ.944.
* ఈక్విటీల నుండి పెద్ద ఎత్తున ఉపసంహరణ
అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్- హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా విదేశీ మదుపర్లు (FPIs) ఈ నెలలో భారత ఈక్విటీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు రూ.9,800 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. సెప్టెంబరులో అయితే ఏకంగా రూ.14,767 కోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఈక్విటీలోకి విదేశీ మదుపర్ల ద్వారా నికరంగా రూ. 1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఇండియన్ ఈక్విటీల్లో విదేశీ మదుపర్లు (FPIs) రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి.మరోవైపు, ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది డెట్ మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐల ద్వారా వచ్చే పెట్టుబడులు రూ.33 వేల కోట్లకు చేరాయి. రంగాలవారీగా చూస్తే.. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. మూలధన వస్తువులు, ఆటోమొబైల్స్ రంగాల్లో మాత్రం కొనుగోళ్లను కొనసాగించారు.
* తగ్గిన డీమార్ట్ లాభం
డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.623.35 కోట్ల నికర లాభం సాధించింది. కిందటే డాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.685.71 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 9.09 శాతం తగ్గింది. జనరల్ మర్చండైజ్, క్లాత్స్ బిజినెస్‌ల నుంచి మార్జిన్స్ (లాభం) పడిపోవడమే ఇందుకు కారణం. రెవెన్యూ మాత్రం రూ. 10,638.33 కోట్ల నుంచి 18.66 శాతం పెరిగి రూ. 12,624.37 కోట్లకు ఎగసింది. కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.11,809 కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్ పీరియడ్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు రూ.24,489.81 కోట్ల రెవెన్యూపై రూ. 1,282.06 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ గ్రాస్ మార్జిన్స్ తగ్గాయి. ఈ క్వార్టర్‌లో కొత్తగా 9 డీమార్ట్ స్టోర్లను ఓపెన్ చేశామని, మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య 336 కి పెరిగిందని వివరించారు.మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్లను అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆపరేట్ చేస్తోంది.
👉 – Please join our whatsapp channel here