Politics

బీజేపీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేరు: హరీశ్‌రావు

బీజేపీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేరు: హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌వంటి నేతలు ఎమ్మెల్యేకు పోటీ చేయం.. ఎంపీకి పోటీ చేస్తామని తప్పించుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలంగాణకు వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై అక్కసు చాలాసార్లు వెళ్లగక్కారని ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణకు చేసిన ఒక రూపాయి అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే మా పథకాలు కాపీ కొట్టి ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇవ్వని పరిస్థితి ఉందని, తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన బీజేపీ ప్రధానమంత్రి ఢిల్లీలో మెచ్చుకొని రాజకీయం కోసం గల్లీలో తిట్టడం ఎందుకున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోదీ పార్లమెంటులో కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన నీళ్ల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతారని చెప్పి.. ఈ రోజు గల్లీకి వచ్చి రాజకీయ కుట్ర పూర్తి మాటలు మాట్లాడం ఎందుకున్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఇతర రాష్ట్ర మేనిఫెస్టోల్లో పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డదన్నారు. తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్న విధంగా మారిందని, సీట్లు కావాలంటే ఢిల్లీకే పోవాలి.. పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి.. ఆఖరికి ఓట్లు కావాలంటే కూడా ఢిల్లీ నుంచి నాయకులు రావాల్సిన పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పార్టీలదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రాజ్‌నాథ్‌ సింగ్ నవ్వుల పాలవడం తప్ప ఏమీకాదని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం దాన్ని ప్రజలకు పంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్తత్వమన్నారు. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలను పెంచి అందిస్తున్నారు.

కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుకు ఒక స్కామ్‌తో కుదేలవుతుందని.. ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందన్నారు. కానీ 11 సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేయని పరిస్థితని, తొమ్మిదేళ్ల సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టేనని, ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. సిద్దిపేట కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z