చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున మంగళవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z