Business

టీసీఎస్‌ మరో కీలక ప్రకటన-వాణిజ్య వార్తలు

టీసీఎస్‌ మరో కీలక ప్రకటన-వాణిజ్య వార్తలు

టీసీఎస్‌ మరో కీలక ప్రకటన

ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి ప్రముఖ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) స్వస్తి పలికింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో నవంబర్‌ 1నుంచి (అంచనా) సిబ్బంది  కార్యాలయాల నుంచి పనిచేయనున్నారు. ఈ తరుణంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేసింది.వర్క్‌ ఫ్రమ్‌ ముగింపు పలికిన టీసీఎస్‌.. తాజాగా ఉద్యోగులకు మరోసారి మెయిల్స్‌ పంపింది. ఆఫీస్‌కి వచ్చే ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో సంస్థ సంప్రదాయాల్ని మరువకూడదని గుర్తు చేసింది. ముఖ్యంగా, వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్‌ లక్కడ్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

 దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మూడురోజుల నష్టాల తర్వాత మంగళవారం ఉదయం లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు.. దేశీయ మార్కెట్లపై సైతం ప్రభావం పడింది. దీంతో ఇంట్రాడేలో అదేబాటలో పయనించాయి. ఉదయం సెన్సెక్స్‌ 66,558.15 పాయింట్ల లాభాలతో ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 66,559.82 పాయింట్ల వరకు చేరింది. చివరకు 261.16 పాయింట్ల లాభంతో 66,428.09 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.75 పాయింట్లు లాభపడి 19,811.50 వద్ద ముగిసింది.

స్మార్ట్ఫోన్ ఉపయోగించని వారికి గుడ్న్యూస్

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు. కీప్యాడ్ మొబైల్‌లపై అందుబాటులో ఉన్న తగ్గింపుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ Motorola ఫోన్ డ్యూయల్ సిమ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1599. దీనిని మీరు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1249కి కొనుగోలు చేయవచ్చు. ఈ Motorola ఫోన్ 800mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే మీరు మైక్రో SD కార్డ్ సహాయంతో ఫోన్ మెమరీని 32 GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.నోకియా ఎల్లప్పుడూ నమ్మదగిన బ్రాండ్. కంపెనీ కీప్యాడ్ మొబైల్‌లు ఇప్పటికీ వినియోగదారుల యొక్క మొదటి ఎంపిక. నోకియా 5310 ఫోన్ అసలు ధర రూ. 4,299. మీరు కేవలం రూ. 3,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో MP3 ప్లేయర్, FM రేడియో, బ్యాక్ కెమెరా ఉన్నాయి.జియో ఫోన్ 4G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. జియో సినిమా, జియో సావన్, జియో పే ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లో 2000mAh బ్యాటరీ, డిజిటల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,999. మీరు కేవలం రూ. 1299కి కొనుగోలు చేయవచ్చు.

* బ్లూటూత్ టెక్నాలజీతో  TVS కొత్త స్కూటర్‌ను విడుదల

 ప్రముఖ టూవీలర్ దిగ్గజ తయారీ కంపెనీ TVS కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘TVS జూపిటర్ 125’. దీన్ని స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. దీని ధర రూ.96,855. వినియోగదారులకు అవసరం అయ్యే అన్ని ఫీచర్లను దీనిలో అందించారు. ఈ స్కూటర్‌ను టీవీఎస్ మొబైల్ యాప్‌కు కనెక్ట్ చేసుకుని నావిగేషన్, కాల్స్ నోటిఫికేషన్స్ మొదలగు వాటిని పొందవచ్చు. ఇది 124.8cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. 8.18bhp పవర్, 10.5nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఎలిగంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. సీటింగ్ కూడా కంఫర్ట్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వెనుక కూర్చునే వారికి బ్యాక్ రెస్ట్‌తో కూడిన సీటింగ్ అందించారు. SmartXonnect టెక్నాలజీ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు.

మరో అంతర్జాతీయ సదస్సుకు వేదకగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్‌ కార్పొరేట్‌ సమ్మిట్‌ 2023ని నిర్వహిస్తున్నారు.రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సదస్సులో పరిశ్రమల రంగంలో పెట్టుబడులు, ఆర్థికపరమైన అంశాలు, భవిష్యత్తు వ్యూహాలు, సుస్థిరాభివృద్ధి, సంపద సృష్టి తదితర అంశాలపై చర్చించనున్నారు. సౌత్‌ సుడాన్‌ ప్రధాని ప్రత్యేక సలహాదారు, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ దీపక్‌ వోహ్రా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పర్వీందర్‌ సింగ్‌ గౌరవ అతిధిగా పాల్గొంటున్నారు.

* చిక్కుల్లో HDFC బ్యాంకు

బ్యాంకులు మాములుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ స్కీమ్స్, పాలిసిస్ లను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటారు. కానీ ఏ స్కీం లేదా పాలసీ అయినా ప్రజల్లోకి విరివిగా వెళ్లాలంటే అందుకు తగిన ప్రమోషన్స్ చేయవలసిందే. అందులో భాగంగానే బ్యాంక్స్ కొన్ని యాడ్స్ ను చేసి వాటి ద్వారా స్కీం ల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెబుతుంటారు. తాజాగా ప్రముఖ కార్పొరేట్ బ్యాంకు అయిన HDFC చేసిన ఒక యాడ్ ఇప్పుడు కొత్త చిక్కులను తీసుకువచ్చింది. ఈ యాడ్ లో ఒక మహిళా నుదుటున బొట్టుకూ బదులుగా, ఒక స్టాప్ అనే సింబల్ ను పెట్టడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఈ యాడ్ ను చూసిన హిందూ మహిళలు పవిత్రంగా భావించే బొట్టు స్థానంలో స్టాఫ్ సింబల్ ను ఏ విధంగా పెడతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం దసరా నవరాత్రి సమయం కూడా కావడం వలన ఇది పెద్ద స్థాయిలో దుమారాన్ని రేపే అవకాశం ఉంది. దీనిపై HDFC బ్యాంకు స్పందించకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

 లేఆఫ్స్ ప్రకటించిన లింక్డిన్‌‌

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతోంది. పలు కంపెనీలు విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ (LinkedIn) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సుమారు 20 వేల మంది సిబ్బందిని కలిగి ఉన్న లింక్డిన్‌ తాజాగా రెండో రౌండ్‌ లేఆఫ్స్‌ను ప్రకటించింది. దీంతో సంస్థలోని దాదాపు 3 శాతం అంటే 668 మంది ఉద్యోగులపై లేఆఫ్స్‌ ప్రభావం పడనుంది. ఇంజినీరింగ్‌, ఉత్పత్తి, ఫైనాన్స్‌ విభాగంలోని ఉద్యోగులపై వేటు పడనుంది. ఈ విషయాన్ని లింక్డిన్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. ‘ఈ రోజు మేము మా బృందంతో కలిసి చేసిన మార్పుల వల్ల ఇంజినీరింగ్‌, ఉత్పత్తి, ఫైనాన్స్‌ విభాగాల్లో దాదాపు 668 మంది తమ ఉద్యోగం కోల్పోనున్నారు’ అని లింక్డిన్‌ తన అధికారిక బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది.