WorldWonders

వేధింపుల భర్త నుండి విడాకుల పండగ

వేధింపుల భర్త నుండి విడాకుల పండగ

అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసి తట్టుకోలేక ఓ తండ్రి.. ఆమెను మేళతాళాలు, బాణసంచా సందడి మధ్య పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న జరిగిన ఈ ఊరేగింపువీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. రాంచీలో నివసించే ప్రేమ్‌ గుప్తా అనే వ్యక్తి.. గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్‌ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని ప్రేమ్‌ గుప్తా చెప్పారు. సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు తెలిసిందని, అయినప్పటికీ అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి పేర్కొన్నారు. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండటం సాధ్యం కాదని అనుకున్నట్లు వివరించారు. అందుకే వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాన్ని సాక్షి తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని ప్రేమ్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు సాక్షి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z