* పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన మహిళ
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. తన సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఈ పని చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి లో వెలుగు చూసింది. ఓ మహిళ గత ఐదు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగుచెందిన ఆ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. ఇది చూసిన పోలీసులు.. ఆ మహిళకు నచ్చజెప్పి.. తాళం తీశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* హైదరాబాద్‌లో భారీగా నగదు మద్యం పోలీసులు స్వాధీనం
తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్ల నగదు, రూ.2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సీజ్ చేశారు. 5,529 లైసెన్స్‌డ్ తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండోవర్ చేశారు.తాజాగా, చందానగర్‌లో భారీగా బంగారం, వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు లభించగా, చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు.
* తల్లితో కలిసి 8 నెలల గర్భిణి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో 8 నెలల గర్భిణి తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.. 8 నెలల గర్భిణి అయిన మహిళ.. తన భర్త మరణించడంతో.. తీవ్ర మనో వేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.. నెల్లూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని విక్రమ్ నగర్‌లో తల్లి.. కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. 8 నెలల గర్భిణిగా ఉన్న భాను లత తన తల్లి లక్ష్మితో కలిసి విక్రమ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.. అయితే, ఇటీవలే భాను లత భర్త సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో మరణించాడు.. అప్పటి నుంచి ఆమె తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు.. భర్త లేని జీవితం వ్యర్థమని భావించి తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారనే సమాచారం తెలియడంతో వారి బంధువులు. మిత్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.. ఆమె ఆత్మహత్యకు బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి మరణించడాన్ని తట్టుకోలేకే.. తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారా..? వారు జీవితాన్ని చాలించడం వెనుక ఇంకా ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? నేది తెలియాల్సి ఉంది. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* కంకిపాడులో 6కోట్ల విలువైన బంగారం చోరీ
కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచి కార్యాలయంలో రూ.6 కోట్ల విలువ చేసే 10.660 కేజీల బంగారం అపహరణకు గురైంది. బ్రాంచ్‌లో పనిచేసే పావని అనే ఉద్యోగిని మరో వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్టు.. బ్యాంకు ఉద్యోగులు ఉన్నతాధికారులు సమాచారమందించారు. ఉన్నతాధికారులు వచ్చి ఖాతాదారుల రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేశారు. బ్రాంచిలో 1477 మంది ఖాతాదారులు ఉండగా.. 16కేజీల బంగారం తాకట్టులో ఉంది. ఇందులో 10.660 కేజీల బంగారం పావని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితురాలు పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* నందిగామలో భారీ అగ్ని ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పర్నిచర్ తయారీ షాప్ లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పర్నీచర్ తయారీ కోసం ఉపయోగించే వుడ్, ప్లైవుడ్ తో కొంత పర్నీచర్, యంత్రాలు ఈ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగకున్నా భారీగా ఆస్తినష్టం జరిగింది.అగ్నిప్రమాదం జరిగిన షాప్ యజమాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిగామ పాత బస్టాండ్ సమీపంలో శ్రీ బాలాజి డోర్స్ ఆండ్ వుడ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా ఈ షాప్ పనిచేసిన సిబ్బంది బుధవారం తెల్లవారుజామున వెళ్లిపోయారు. షాప్ యజమాని మెండే ప్రసాద్ కూడా తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు.అయితే యజమాని వెళ్ళిపోయిన కొద్దిసేపటికే షాప్ లోంచి చిన్నగా పొగలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటం గమనించిన స్థానికులు యజమాని ప్రసాద్ తో పాటు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి నందిగామ, కంచికచర్ల నుండి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేసారు.
* లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
లైంగిక దాడి కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2018లో బాలికపై లైంగిక దాడికి రాంబాబు అనే వ్యక్తి పాల్పడ్డాడు. దీంతో రాంబాబుకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. బాధితురాలికి రూ.8లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
* టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ఇదే సమయంలో అక్కడక్క వాలంటీర్ల ఆగడాలు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. దోపిడీలు, దొంగతనాలు.. అత్యాచారాలు.. ఇలా పలు కేసుల్లో వాలంటీర్ల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది.. తాజాగా, ఏలూరులో ఓ వాలంటీర్ దుర్మార్గం వెలుగు చూసింది.. జిల్లాలోని దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారగానికి పాల్పడ్డాడు వాలంటీర్.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వెళ్లి.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట వాలంటీర్ నీలాపు శివకుమార్.. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో.. అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది.. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు.. ఆ తల్లిదండ్రుల దగ్గర వాయిపోయిందట విద్యార్థిని.. దీంతో.. వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు..ఇక, శివకుమార్‌పై కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్లు తీవ్ర కలకలమే రేపాయి.. వాలంటీర్లలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు న్యాయపోరాటానికి దిగిన విషయం విదితమే కాగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వారిపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటూ వస్తోంది సర్కార్.
* ప్రభుత్వ స్కీంల పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు
మీ ఫోన్లో ఓటిపిలు వస్తున్నాయా.. జాగ్రత్త సుమా.. తొందరపడ్డారా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. నీకు ఇంటి స్థలం మంజూరు అయింది, లేదా నీవు ప్రభుత్వ పథకానికి అర్హుడివి అయ్యావు అంటూ.. నీ ఫోన్లకు ఓటిపిలు పంపుతున్నారా.. అలాగే ఎవరైనా మీకు ఫోన్ చేసి వచ్చిన ఓటీపీలు చెప్పమంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. జాగ్రత్తగా చదవండి.. ఆదమరిచారా అంతే సంగతులు.. తరువాత నెత్తి నోరు కొట్టుకున్న జరగాల్సిన నష్టం జరిగి తీరిపోతుంది.. ఓటిపిల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే వారి మోసానికి అడ్డుకట్ట వెయవచ్చని అధికారులు అంటున్నారు.
* ముగ్గురిని హత్య చేసిన మాజీ నేవీ వ్యక్తి
ఒక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో మాజీ నేవీ వ్యక్తి (Ex Navyman) ముగ్గురిని హత్య చేశాడు. ఆ తర్వాత పేరు మార్చుకుని మరో రంగంలో సెటిల్ అయ్యాడు. అయితే 20 ఏళ్ల తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. హర్యానాకు చెందిన బాలేష్ కుమార్ 8వ తరగతి వరకు చదివాడు. 1981లో నేవీలో చేరిన అతడు 1996లో పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం ప్రారంభించాడు. కుటుంబంతో కలిసి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో నివసించాడు.కాగా, స్నేహితుడైన రాజేష్ భార్యతో కుమార్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2004లో మద్యం మత్తులో ఉన్న వారి మధ్య ఈ అంశంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుమార్, తన సోదరుడితో కలిసి గొంతు నొక్కి రాజేష్‌ను హత్య చేశాడు. బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం వారితో కలిసి పారిపోయేందుకు ప్లాన్ వేశాడు. కూలీలతో కలిసి సోదరుడి లారీలో ప్రయాణించిన కుమార్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆ వాహనానికి నిప్పుపెట్టాడు. తన పత్రాలను ఆ వాహనంలో వదిలేశాడు. అందులోని ఇద్దరు కూలీలు సజీవ దహనమయ్యారు. మరోవైపు కాలిన లారీలో ఉన్న పత్రాల ఆధారంగా ఒక మృతుడ్ని కుమార్‌గా రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజేష్ హత్య కేసుపై దర్యాప్తు జరిపిన ఢిల్లీ పోలీసులు కుమార్ సోదరుడ్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన కుమార్ రాజస్థాన్‌లో జరిగిన లారీ అగ్నిప్రమాదంలో సజీవ దహనమైనట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీమా, పెన్షన్ బెనిఫిట్స్ అతడి భార్యకు అందాయి.కాగా, కుమార్ తన పేరును అమన్ సింగ్‌గా మార్చుకున్నాడు. ఢిల్లీలోని మరో ప్రాంతంలో ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడు బతికే ఉన్నట్లు పోలీసులకు ఇటీవల తెలిసింది. దీంతో 20 ఏళ్ల తర్వాత ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సున్న కుమార్‌ను రాజేష్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ప్రశ్నించగా బీహార్ కూలీల హత్య గురించి తెలిసింది. ఈ నేపథ్యంలో కాలిన లారీ కేసుపై దర్యాప్తు కోసం రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –