ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావ్‌డేకర్ నివాసంలో గురువారం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై చర్చించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న స్థానాలు, సామాజికవర్గాల పరంగా సీట్ల కేటాయింపుపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ కోర్ కమిటీ సభ్యులు పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత గురువారం రాత్రి నడ్డా నివాసంలో కోర్ కమిటీ మరోసారి సమావేశమైంది. దీనికి అమిత్‌షా హాజరయ్యారు.
అన్ని స్థానాలపై కోర్ కమిటీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దాన్ని శుక్రవారం సాయంత్రం జరిగే భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. ఇందులో ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొంటారు. ఆ సమావేశంలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు తెలంగాణకు చెందిన అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. తుది ప్రకటన చేయనున్నారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లపై ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉండడంతో తెలంగాణకు సంబంధించి 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –