Sports

భారత్ ఘన విజయం

భారత్ ఘన విజయం

వన్డే ప్రపంచ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (103*; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘శత’క్కొట్టడంతో ఈ లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (53; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో అలరించగా.. రోహిత్‌ శర్మ (48; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (19; 25 బంతుల్లో 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేఎల్ రాహుల్ (34*; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు తాంజిద్‌ హసన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిట్టన్ దాస్‌ (66; 82 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. తర్వాత వచ్చిన నజ్ముల్ శాంటో (8), మెహదీ హసన్ మిరాజ్‌ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. తౌహిద్‌ హృదోయ్‌ (16), నసుమ్ అహ్మద్ (14) పరుగులు చేశారు. ముష్ఫీకర్ రహీమ్‌ (38; 46 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహ్మదుల్లా (46; 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, మహ్మద్‌ సిరాజ్‌ 2, జస్‌ప్రీత్‌ బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్ యాదవ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z