భారతీయులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చింది ఇండియన్ రైల్వేస్.. రైలు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు హైస్పీడ్ `రాపిడ్ ఎక్స్` రైలు ప్రారంభం కానున్నది. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలులో పలు అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇందుకోసం రూపుదిద్దుకున్న ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) కారిడార్’ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సాహిబాబాద్- దుహై డిపో మధ్య 17 కి.మీ దూరం గల ప్రాధాన్య కారిడార్‌లో తొలి `రాపిడ్ ఎక్స్’ రైలు సేవలను పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు.
శనివారం (అక్టోబర్ 21) నుంచి ప్రయాణికులకు ‘ర్యాపిడ్ ఎక్స్’ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ పరిధిలో ఐదు స్టేషన్ల మీదుగా ‘ర్యాపిడ్ ఎక్స్’ రైలు సేవలు ప్రారంభం అవుతాయి.
పూర్తిగా ఎయిర్ కండిషన్డ్‌గా ఉండే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలను ద్రుష్టిలో పెట్టుకుని పలు ఫీచర్లు కల్పించారు. ప్రతి రైలులోనూ 2×2 లేఔట్‌లో సీట్లు, నిలబడటానికి విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ మెకానిజం, లాప్ టాప్ లేదా మొబైల్ చార్జింగ్ పాయింట్లు, డైనమిక్ రూట్ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియెంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ తదితర వసతులు ఉన్నాయి.
మెట్రో రైలు సర్వీసుల మాదిరిగానే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసులు అందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకో రైలు నడుస్తుంది. ఆరు కోచ్‌లు ఉన్న ఈ రైలులో 1700 మంది ప్రయాణం చేయొచ్చు. స్టాండర్డ్, ప్రీమియం కోచ్‌లు ఉంటాయి. స్టాండర్డ్ కోచ్‌ల్లో 72, ప్రీమియం కోచ్‌ల్లో 62 మంది కూర్చోవచ్చు. స్టాండర్డ్ కోచ్ టికెట్ ధర కనీసం రూ.20, గరిష్టం రూ.50గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్ లో కనీసం రూ.40, గరిష్టం రూ.100 గా నిర్ణయించారు.
మహిళలకోసం ప్రతి రైలులో ఒక కోచ్ అదీ ప్రీమియం కోచ్ పక్కనే ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి కోచ్ లోనూ మహిళలు, సీనియర్ సిటిజన్లకు సీట్లు రిజర్వు చేశారు. ప్రతి ప్రీమియం కోచ్ లోనూ ప్రయాణికులకు సహకరించేందుకు ఒక అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రీమియం కోచ్‌ల్లో వెనక్కి వాలి కూర్చునేలా సీట్లతోపాటు కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్లు, ఫుట్ రెస్ట్ తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి. మీరట్-ఢిల్లీ వెళ్లే తొలి రైలు, ఢిల్లీ-మీరట్ వెళ్లే చివరి రైలు ప్రీమియం కోచ్ లతో ఉంటాయి. వీటిల్లోకి ప్లాట్ ఫామ్ ప్రీమియం లాంజ్ ద్వారా వెళ్లొచ్చు. లాంజ్‌ల్లో సౌకర్యవంతమైన కుషన్ సీట్లు ఏర్పాటు చేశారు. స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కోవచ్చు.