* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని ప్రదర్శించాయి. మధ్యమధ్యలో కొంత కొనుగోళ్ల అండ లభించినప్పటికీ లాభాల్లోకి మాత్రం వెళ్లలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65,629కి పడిపోయింది. నిఫ్టీ 46 పాయింట్లు కోల్పోయి 19,624కి దిగజారింది.
* ఇండియాలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల తయారీ
పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను ఇక నుంచి ఇండియాలో తయారు చేయనున్నట్లు గూగుల్(Google) సంస్థ ప్రకటించింది. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పేలో జరుగుతున్న అవకతవకల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. అనుమానిత లావాదేవీలపై ఆయా వ్యక్తలకు వారి స్వంత భాషల్లో అప్రమత్తత జారీ చేస్తున్నామన్నారు. ఫ్రాడ్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని గూగుల్ చెప్పింది. దాదాపు ఏడాది కాలంలో గూగుల్‌పై సుమారు 12 వేల కోట్ల స్కామ్‌ను అడ్డుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇండియాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పాలసీలను ఉల్లంఘించిన 20 లక్షల యూట్యూబ్ వీడియోలను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది.
* డాబర్ ఉత్పత్తులపై యూఎస్ కెనడాల్లో కేసులు
డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.దీని కారణంగా కంపెనీ షేర్స్ గురువారం 2.5 శాతం వరకు పడిపోయాయి. మధ్యాహ్నం 12.06 గంటల వరకు 1.7 శాతం తగ్గి 525 రూపాయాల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో తన ఇయర్ టూ డేట్ క్షీణతను 6.5 శాతానికి పొడగించింది. ప్రస్తుతం కేసులు తొలిదశల్లో ఉన్నాయని, ఈ ఆరోపణలు నిరాధారణమై, అసంపూర్ణ అధ్యయనం ఆధారంగా ఉన్నాయని పేర్కొంది.డాబర్ కంపెనీకి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్సీ, డాబార్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్లు డాబర్ ఇండియా ప్రకటనలో తెలియజేసింది. డాబార్ ఉత్పత్తులు పలు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. డాబర్ హెయిర్ రిలాక్సర్లు, హెయిర్ స్ట్రయిటనర్లను ఎలాంటి వైద్యుల సిఫారసు లేకుండా ఓవర్ ద కౌంటర్ గా విక్రమిస్తోందని ఆరోపిస్తున్నారు. మల్టీ డిస్ట్రిక్ లిటిగేషన్ కింద 5400 కేసులు నమోదయ్యాయి.
* సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లను పెరిగిన గిరాకీ
దేశంలో సెకండ్‌హ్యాండ్ ఫోన్ల (Used phones)కు ఈ ఏడాది గిరాకీ పుంజుకుందని ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. అదే సమయంలో కొత్త స్మార్ట్ ఫోన్ల (smartphones) విక్రయాలు తగ్గినట్లు వెల్లడించింది. ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ ఏడాది సెకండ్ హ్యాండ్, రీఫర్బిష్డ్ ఫోన్లు (తిరిగి విక్రయానికి సిద్ధం చేసిన పాత ఫోన్లు) దాదాపు 3.5-4.5 కోట్లు అమ్ముడవుతాయని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికం. అదే సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్ల (smartphones) విక్రయాలు ఐదు శాతం తగ్గుతాయి. గత ఏడాది 15.1 కోట్ల కొత్త ఫోన్లు అమ్ముడయ్యాయి.మరోవైపు ఏప్రిల్-జూన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ల (smartphones) ఎగుమతులు మూడు శాతం తగ్గాయి. అయితే, జనవరి-మార్చిలో నమోదైన 19 శాతం క్షీణతతో పోలిస్తే మాత్రం మెరుగుపడినట్లే లెక్క. మరోవైపు వినియోగ ఫోన్ల విక్రయాలకు గిరాకీ పుంజుకోవడానికి అవి అందుబాటులో ధరలో లభ్యమవుతుండడం కాదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సహ- వ్యవస్థాపకుడు నీల్ షా వెల్లడించారు. వినియోగదారుల కొనుగోళ్ల తీరులో మార్పు రావడమే అందుకు కారణమన్నారు. కొంత మంది ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకోవడం, ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ (smartphones) వాడుతున్న వాళ్లు దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకోడం ఈ విక్రయాలకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
పత్రి నెల ఒకటో తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చు కుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.66,లీటర్ డీజిల్ ధర: రూ. 98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర: రూ. 110.48,లీటర్ డీజిల్ ధర: రూ. 98 విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.64,లీటర్ డీజిల్ ధర: రూ. 99
* రానున్న కొత్త సీఎన్‌జీ బైక్
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్‌జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్‌నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్‌జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్‌జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు.సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్‌జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
* టెక్ దిగ్గజాల్లో కొనసాగుతున్న కొలువుల కోత
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ (Nokia Layoffs) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 14,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు నోకియా వెల్లడించింది.ఉత్తర అమెరికా సహా కీలక మార్కెట్లలో 5జీ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా థర్డ్ క్వార్టర్ సేల్స్ 20 శాతం పడిపోయిన నేపధ్యంలో లేఆఫ్స్ వార్తలు వెలువడటం గమనార్హం. ఆపరేషన్స్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చులకు కళ్లెం వేసేందుకు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు నోకియా గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2026 నాటికి 14 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించే లక్ష్యంతో నోకియా పలు చర్యలు చేపడుతోంది.తాజా లేఆఫ్స్‌తో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 72,000కు తగ్గనుంది. లేఆఫ్స్‌తో కంపెనీకి పెద్దమొత్తంలో నిధులు ఆదా అవుతాయని నోకియా లెక్కగడుతోంది. నోకియానే కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించకుని, వ్యాపార పునర్వ్యవస్ధీకరణ చేపట్టేందుకు వేలాది ఉద్యోగులను తొలగించాయి.
* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యవసర వస్తువుల్లో ఒక్కటైన గ్యాస్ సిలిండర్ రేట్లను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే.. గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను ఇటీవల తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912, విజయవాడ: రూ. 927,గుంటూరు: రూ. 944.
👉 – Please join our whatsapp channel here –