తానా మాజీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్ర ప్రముఖుడు, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకుడు డా. తోటకూర ప్రసాద్‌కు అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గురువారం సాయంత్రం ఫ్రిస్కోలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా. కొలకలూరి ఇనాక్ చేతుల మీదుగా దీన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇనాక్ ప్రసంగిస్తూ 1993లో అక్కినేని చేతుల మీదుగా ఏర్పడిన ఆకృతి సంస్థ గన్నవరంలో పుట్టి, అమెరికాలో మెట్టి తెలుగువారికి భారతీయులకు సేవలందిస్తున్న డా. తోటకూర ప్రసాద్ వంటి ప్రతిభామూర్తికి అక్కినేని-ఆకృతి పురస్కారం అందజేయడం గర్వకారణమన్నారు. వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున ఆయన గౌరవిస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేపట్టిన పురస్కార యాత్ర గొప్పదని కొనియాడారు. అక్కినేని-ఆకృతి పురస్కారం ఆయన అందుకోవడం బంగారానికి వాసన లభించడం వంటిదని కొనియాడారు. ప్రవాసులు తెలుగు రాష్ట్రాల్లో సాహితీ, కళా రంగాలకు చెందిన కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నారని ప్రశంసించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z
డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి అక్కినేనితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. తోటకూర ప్రసాద్ వంటి వారి సాన్నిహిత్యం లభించడం పట్ల ఆనందాన్ని వెలిబుచ్చారు. రావు కల్వల ప్రసంగిస్తూ ప్రశాంత చిత్తం, స్పష్టమైన ఆలోచన ప్రసాద్ బలమని, ఆయనతో కలిసి గాంధీ పార్కు ఏర్పాటుకు చేసిన కృషిని సభకు గుర్తు చేశారు.
అక్కినేనితో తన అనుబంధం గురించి ప్రసంగిస్తూ…అక్కినేని కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యమనే ఆయుధాలతో ఎదిగిన మనిషని ప్రసాద్ అన్నారు. బలహీనతలను బలంగా మార్చుకోవడం ఆయనకు బాగా తెలిసిన విద్య అని కొనియాడారు. నాస్తికుడు అయినప్పటికీ తన పనే తన దైవంగా భావించిన ధీరోదాత్తుడు అక్కినేని అని ప్రసాద్ గుర్తుచేశారు. డల్లాస్‌లో అక్కినేని 89వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనతో పెనవేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అనంతరం “ANR 100” పేరిట అక్కినేని అపురూప చిత్రాల పుస్తకాన్ని విడుదల చేశారు. అక్కినేని వంశవృక్షాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తక రూపకల్పనకు తోడ్పడిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, వేముల లెనిన్, చినసత్యం వీర్నపు, మాడ దయాకర్‌లకు తొలిప్రతులను అందజేశారు.
ఆకృతి సంస్థ వ్యవస్థాపకుడు సుధాకర్ కార్యక్రమానికి హాజరయిన వారికి ధన్యవాదాలు తెలిపారు. డా. తోటకూర ప్రసాద్ వంటివారిని గౌరవించే అవకాశం కల్పించినందుకు హర్షం వెలిబుచ్చారు. అనంతరం సుధాకర్‌ను ప్రసాద్ తదితరులు జ్ఞాపికతో సత్కరించారు. సభ ప్రారంభానికి పూర్వం కోట ప్రభాకర్, మద్దుకూరి చంద్రహాస్, లక్ష్మీభారతిల సంగీత విభావరి అలరించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z