* విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద విషాదం
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర తీరాన ఈత కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థులలో ఒకరిని కోన ఊపిరితో ఉన్న స్థితిలో బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతడిని హర్షగా గుర్తించారు. మరో విద్యార్థి రాజ్‌కుమార్ కోసం గాలింపు కొనసాగుతుంది. ఇద్దరు విద్యార్థులు కూడా ఎన్నారై కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత విద్యార్థుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలు
మద్యం మత్తులో రోడ్డుపై న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్న ఓ వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు ఫెనాల్టీ విధించింది. అబిడ్స్ ఇన్ స్పెక్టర్ నరసింహ రాజు కథనం ప్రకారం కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన సత్తార్ అలీ (24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఐదు రోజుల క్రితం పీకలదాకా మద్యం సేవించిన సత్తార్ అలీ రోడ్డుపై వెళ్తున్న వారిని దూషించడం, మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా మాట్లాడడం చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు సత్తార్ అలీని అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్ కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి దాని ఆధారంగా కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ జరిపిన నాంపల్లి లోని 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితునికి మూడు రోజుల జైలుతో పాటు రూ. 550 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ నరసిహ రాజు మాట్లాడుతూ ఇలాంటి చిన్న చిన్న కేసులలో కూడా న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తున్న విషయాన్ని గుర్తించి ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
* యువతితో బుక్కయిన కానిస్టేబుల్
రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్. ఇది మర్చిపోయి నేను ఎం చేసిన అడిగేవాళ్ళే లేరు నాకేంటి అని రెచ్చిపోతే. నువ్వెంటి నీ తల్లో జేజమ్మ కూడా చట్టానికి తలవంచక తగప్పదు అంటారు అధికారులు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ ఎం అయిందా? అనేగా మీ సందేహం.. లాడ్జిలో తప్పుడు పనులను చేసే వాళ్ళని బుక్ చెయ్యాల్సిన కానిస్టేబుల్ తానే యువతితో రాసలీల సాగిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరులో శ్రీనివాస రావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఇతనికి ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే శ్రీనివాస రావు మరో యువతితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య భర్తలకు తరుచు వాగ్వివాదాలు జరుగుతుండేవి. భార్య ఎన్ని సార్లు అడిగిన అలాంటిది ఏమి లేదని బుకాయించేవాడు శ్రీనివాస్. కాగా ఓ లాడ్జిలో శ్రీనివాస్ రావు యువతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాస్ రావు భార్య, బంధువులు. వెంటనే భార్య, బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లాడ్జిలో ఉన్న శ్రీనివాస్ రావుని అలానే యువతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
* పీఎంఓ నకిలీ అధికారి పై కేసు
ప్రధాన మంత్రి కార్యాలయంలో తాను ఒక ఉన్నతాధికారిని అని పేర్కొంటూ.. సెటిల్ మెంట్ వ్యవహారానికి దిగిన మోసగాడు మయాంక్ తివారి కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా తివారికి సంబంధించిన పలు ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అధికారులు.ఈ కేసులో తివారీని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పారు. డాక్టర్ అగర్వాల్ అనే కంటి ఆసుపత్రిలో ఇందౌర్ కు చెందిన ఓ ఆసుపత్రి గతంలో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం నిబంధనలను ఇందౌర్ ఆసుపత్రి ఉల్లంఘించడంతో డాక్టర్ అగర్వాల్ ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఈ విషయం హై కోర్టు వరకు వెళ్లడంతో డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ కి రూ.16.43 కోట్లు చెల్లించాలని ఇందౌర్ హాస్పిటల్ ను ఆదేశించింది కోర్టు.ఈ వివాదం సమయంలో మయాంక్ తివారీ నుంచి ఆసుపత్రి ప్రమోటర్ డాక్టర్ అగర్వాల్ కి వరుస ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయి. ఆ సొమ్మును మరిచిపోయి ఆసుపత్రిలో పరిష్కారం కుదుర్చుకోవాలంటూ అందులో తివారీ బెదిరించాడు. తాను పీఎంవోలో ఉన్నతాధికారినంటూ పేర్కొన్నాడు.
* శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు శ్రీరంగప్ప దగ్గర కిలోన్నర అక్రమ బంగారం పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా శ్రీ రంగప్ప లగేజ్ ని సిఐఎస్ఎఫ్ అధికారులు స్క్రీనింగ్ చేశారు.అతని లగేజీలో కిలోనర బంగారం బిస్కెట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ… నిందితుడిని కస్టమ్స్ కి అప్పజెప్పారు. విదేశాలనుంచి స్వదేశానికి బంగారాన్ని తరలించడం ఎప్పుడూ కనిపిస్తుండేదే. కానీ ఈ కేసులో మొదటిసారిగా స్వదేశం నుంచి బంగారాన్ని విదేశాలకి అక్రమ రవాణా చేయడం గమనార్హం.శంషాబాద్ ఎయిర్పోర్టు చరిత్రలోనే ఇలా స్వదేశాల నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలిస్తూ పట్టుబడడం మొదటి సారి కావడం చర్చనీయాంశంగా మారింది. మామూలుగా దుబాయ్, షార్జా, నుంచి అక్రమ బంగారం రవాణా జరుగుతుంటుంది. అనేకసార్లు అధికారులు.. ఈ బంగారాన్ని పట్టుకుంటారు. కానీ, మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలించడం.. ఈ ప్రయత్నంలో పట్టుబడడం విశేషం.
* దుంగార్‌పూర్‌లో విషాదం
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి బుధవారం మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుంగార్‌పూర్ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై నుంచి దూకి సుధాన్షి సింగ్ (22) మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పోపట్‌లాల్ తెలిపారు. భరత్‌పూర్‌కు చెందిన సింగ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, హాస్టల్ గదిలో ఒంటరిగా ఉంటున్నాడని ఆయన తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. భరత్‌పూర్ నుంచి మృతుడి కుటుంబ సభ్యులు వచ్చిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించనున్నారు.
* తండ్రి సహజీవనం చేయడాన్ని సహించలేక కుమారులు అతనిపై దాడి
ఆరుపదుల వయసున్న తండ్రి.. ఓ మహిళతో సహజీవనం చేయడం అతని కుమారులకు నచ్చలేదు. ఈ క్రమంలో వారు దాడి చేయగా.. తమ తాత, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ చనిపోయారు. తండ్రి మాత్రం తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమ్రోధ్ పట్టణంలో రామ్‌ప్రకాశ్ ద్వివేది (83), అతని కుమారుడు విమల్ నివసిస్తున్నారు. 63 ఏళ్ల వయసున్న విమల్.. కుష్బూ (30) అనే మహిళతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయంపై విమల్‌కు, అతని కుటుంబ సభ్యులకు తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో విమల్ కుమారుడు లలిత్.. తన సవతి సోదరుడు అక్షత్‌ను వెంటబెట్టుకొని విమల్ ఇంటికి వెళ్లారు. వారు తీరు మార్చుకోవాలని తండ్రిని హెచ్చరిస్తున్న క్రమంలో గొడవ పెద్దదైంది. దాంతో లలిత్, అక్షత్‌లు కలిసి రామ్‌ప్రకాశ్ ద్వివేది, విమల్, కుష్బూలపై దాడి చేశారు. ఆపై రామ్‌ప్రకాశ్, కుష్బూలను పలుమార్లు కత్తితో పొడిచారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు విమల్ ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. ద్వివేది కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మున్నా పరిస్థితిని గమనించి పొరుగునే ఉన్న విమల్ సోదరుడు కమల్‌ను అప్రమత్తం చేశాడు. వారిద్దరూ కలిసి తీవ్రగాయాలపాలైన విమల్‌ను చికిత్స నిమిత్తం కాన్పూర్‌లోని లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తరలించారు.
* ఇరవై రోజుల్లో 5 వరుస హత్యలు
మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఇద్దరు మహిళలు ఓ కుంటుంబాన్ని దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబంపై పగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని విషంపెట్టి మట్టుబెట్టారు. ఎంతో తెలివిగా పక్కాప్లాన్‌తో ఒకే ఇంట్లో ఐదుగురిని చంపేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ వరుస మరణాలు వెలుగు చూడటంతో ఖాఖీలు రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తులో హంతకుల గుట్టు రట్టయ్యింది. ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలున్న ఓ మహిళ, అదే కుటుంబం వల్ల వేధింపులకు గురైన మరో మహిళ కలిసి ఓ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. అందుకు పథకం పన్ని, దాన్ని అమలు చేశారు. ఇలా ఇరవై రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా అయిదుగురి ప్రాణాలు బలి తీసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –