* ఆవిరైన మస్క్ సంపద
టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 210 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అయితే, గురువారం మాత్రం ఆయన సంపద భారీగా ఆవిరైపోయింది. ఒక్కరోజులోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.30 లక్షల కోట్లు అన్నమాట.టెస్లా (Tesla) షేర్లు భారీగా పతనమవడమే మస్క్ సంపద ఆవిరవ్వడానికి ప్రధాన కారణం. 2023-24 మూడో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కి సంబంధించి టెస్లా సంస్థ ఆశించిన మేర రాణించలేకపోయింది. ఈ ఫలితాలు మదుపర్లను తీవ్ర నిరాశపరిచాయి. దీంతో గురువారం కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు 9.3 శాతం మేర పతనమయ్యాయి. దీంతో సంస్థలో 13 శాతం వాటాలున్న మస్క్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన మూడు రోజులుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం దాదాపుగా ప్రారంభ స్థాయిల వద్దే ముగిశాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. పావెల్ ప్రకటనతోపాటు వారంతంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గ్లోబల్ ఇండియన్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 231.36 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 82.05 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 32 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 454 పాయింట్లు పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం మేర నష్టపోయింది.
* సైయంట్ ప్రాఫిట్ 71 శాతం అప్
డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ సర్వీస్‌లు (డీఈటీ) అందిస్తున్న సైయంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 1,476 కోట్ల రెవెన్యూ సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 22 శాతం గ్రోత్‌కు సమానం. అదే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రెవెన్యూతో పోలిస్తే 1.5 శాతం ఎక్కువ. కంపెనీ నికర లాభం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 71 శాతం పెరిగి రూ.172.8 కోట్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్‌లో పాజిటివ్ గ్రోత్ నమోదు చేశామని సైయంట్ ఎండీ బోదనపు కృష్ణ అన్నారు. గ్రూప్ రెవెన్యూ 214.9 మిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు.ఇందులో డీఈటీ బిజినెస్ రెవెన్యూ 178.4 మిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. డీఈటీ సెగ్మెంట్‌లో ఐదు పెద్ద డీల్స్ గెలుచుకున్నామని, వీటి కాంట్రాక్ట్ విలువ 51.4 మిలియన్ డాలర్లు అని కృష్ణ పేర్కొన్నారు. నిలకడైన కరెన్సీ దగ్గర డీఈటీ సెగ్మెంట్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 15–20 శాతం వృద్ధి చెందుతుందని అంచనావేశామన్నారు. సైయంట్ డీఈటీ బిజినెస్ నికర లాభం భారీగా పెరిగిందని కంపెనీ సీఈఓ కార్తిక్ నటరాజన్ అన్నారు. కస్టమర్లకు సాయం చేసేందుకు రోబోటిక్స్, ఏఐ, క్లౌడ్, డేటా వంటి టెక్నాలజీలను వాడతామని చెప్పారు. చాలా ఇండస్ట్రీలలో ఆటోమేషన్ పెరగడం చూస్తున్నామని అన్నారు. సైయంట్ లిమిటెడ్ షేరు గురువారం సెషన్‌లో 4 శాతం పెరిగి రూ. 1,750 దగ్గర క్లోజయ్యింది.
* గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్ పే
తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది గూగుల్ పే.. భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉన్న గూగుల్ పే.. ఇప్పుడు బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFC) చేతులు కలిపింది.. దీని ద్వారా దేశంలోని తన వినియోగదారులు మరియు వ్యాపారుల కోసం క్రెడిట్-కేంద్రీకృత ఉత్పత్తుల శ్రేణిని తీసుకొచ్చింది.. న్యూఢిల్లీలో గూగుల్ వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా, దేశంలోని వ్యాపారులు మరియు వినియోగదారుల కోసం సాచెట్ లోన్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది, వీటిని Gpay యాప్‌లో పొందవచ్చు. టెక్ దిగ్గజం రుణ సేవలను అందించడానికి డీఎంఐ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు పేర్కొంది.ఇక, సాచెట్ లోన్‌లు రూ. 10,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటాయి.. వాటిని 7 రోజుల నుండి 12 నెలల మధ్య కాలవ్యవధిలో తిరిగి చెల్లించే విధంగా ఉంటాయి.. గత సంవత్సరం, గూగుల్ వ్యాపారుల నుండి కొత్త రుణ అవకాశాలను అందించడానికి చిన్న వ్యాపారాలపై దృష్టి సారించిన రుణ ప్లాట్‌ఫారమ్ Indifiతో భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. గూగుల్ పే వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పరిష్కరించడంలో సహాయపడే ఈపేలెటర్ భాగస్వామ్యంతో వ్యాపారుల కోసం క్రెడిట్ లైన్‌ను కూడా ప్రారంభించింది. చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.15,000 లోన్ తీసుకుంటే.. ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది ఆ సంస్థ. అంటే, చిన్న చిన్న మొత్తానికి మరోకరిని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. జీపేనే నేరుగా లోన్లు ఇవ్వనుంది.
* నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే నేడు బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర-రూ. 55, 700,24 క్యారెట్ల బంగారం ధర-రూ. 60,760,విజయవాడలో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర-రూ. 55, 700,24 క్యారెట్ల బంగారం ధర-రూ. 60,760
* లీటర్ పెట్రోల్ 25కే
ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలోనే ఇథనాల్‌ను వాడుకొంటే 25 రూపాయలకే లీటర్ పెట్రోల్‌ను పొందవచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్ రూ.120 పలుకుతున్నదన్న ఆయన.. 60 శాతం విద్యు త్తు, 40 శాతం బయో-ఇథనాల్ మిశ్రమంతో ఇంధన ఖర్చును పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చని తెలిపారు.ఇథనాల్ వాడకంతో రైతులకు కూడా భారీ ప్రయోజనం చేకూరుతుందని, ముడి చమురు దిగుమతుల కోసం ఏటా ఖర్చు చేసే లక్షల కోట్ల రూపాయలనూ మిగుల్చుకోవచ్చని వివరించారు. కాలుష్యం కూడా బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా, ఇథనాల్ ఓ పునరుత్పాదక ఇంధనం. రకరకాల మొక్కల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తారు. వివిధ మిశ్రమాలతో కలిపి వాహన ఇంధనంగా దీన్ని ఉపయోగించవచ్చు. దేశీయ ఆటో రంగ కంపెనీలు ఇథనాల్ ఆధారిత వాహనాలను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేయాలని మంత్రి కోరుతున్నారు. అయితే మూడున్నర నెలల క్రితం ఈ ఏడాది జూలైలోనూ గడ్కరీ.. ఇథనాల్ ప్రయోజనాలను చెప్పగా, అప్పుడు లీటర్ రూ.15కే పెట్రోల్‌ను పొందవచ్చనడం గమనార్హం.
* నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోన్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974.విశాఖపట్నం: రూ. 912, విజయవాడ: రూ.927,గుంటూర్: రూ. 944.
* బీజేపీ ఎంపీకి 137 కోట్ల జరిమానా
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) నాయకుడు, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు ఏక్‌నాథ్ ఖడ్సే, బిజెపికి చెందిన లోక్‌సభ సభ్యురాలు ఆయన కోడలు రక్షా ఖడ్సేలకు ప్రభుత్వం రూ.137 కోట్ల జరిమానా విధించింది. సంబంధిత శాఖ అనుమతి లేకుండా వారి భూమి.. రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జల్‌గావ్‌లోని ముక్తైనగర్ తాలూకా తహసీల్దార్ ఆయనకు అక్టోబర్ 6న నోటీసు జారీ చేశారు.తవ్వకాలకు అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని నోటీసులో పేర్కొన్నారు. తవ్వకాలు జరిపిన భూమి ఏక్నాథ్ ఖడ్సే, అతని భార్య మందాకిని ఖడ్సే, కుమార్తె రోహిణి ఖడ్సే, కోడలు రక్షా ఖడ్సేలకు చెందినదని పేర్కొంది. నోటీసు జారీ చేసిన 15 రోజుల్లోగా రూ.137,14,81,883 జరిమానా చెల్లించాలని పేర్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో ఉన్న ఏక్‌నాథ్ ఖడ్సే ఆ పార్టీని వీడి 2020లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిలో చేరారు. ఏక్నాథ్ ఖడ్సే ప్రస్తుతం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. ఆయన కోడలు రక్షా ఖడ్సే లోక్‌సభలో బీజేపీ సభ్యురాలు.
* అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయన్న ఆర్‌బీఐ గవర్నర్
ఈ ఏడాది జులైలో నమోదైన గరిష్ట స్థాయి(7.44 శాతం) నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ ధోరణి సజావుగా కొనసాగేందుకు మానిటరీ పాలసీ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం జరిగిన కౌటిల్య ఎకనమిక్ కాన్‌క్లేవ్-2023 కార్యక్రమంలో పాల్గొన్న దాస్, ధరలు, ఆర్థిక స్థిరత్వాలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగానే అది ఉంటుందని చెప్పారు.ఇటీవల కూరగాయలు, ఇంధన ధరలు దిగిరావడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టం 5.02 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతానికి కీలక పాలసీ రేట్ల విషయంలో విరామం కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు పెంచిన 250 బేసిస్ పాయింట్లతో ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని దాస్ వివరించారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ ఎంపీసీ కమిటీ నిర్ణయాలతో వడ్డీ రేట్లు గరిష్ఠానికి చేరాయి. ఇవి ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై చెప్పలేమని స్పష్టం చేశారు.ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచాయి. దీనికి భౌగోళిక రాజకీయ పరిణామాలు తోడయ్యాయి. అందుకనుగుణంగానే ఆర్‌బీఐ 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ, ఎంతకాలం స్థిరంగా ఉంటుందనేది చెప్పలేం, కాలమే దానికి జవాబు’ అని దాస్ వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నెమ్మదించిన వృద్ధి, ఆర్థిక అస్థిరత్వ లాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడి చమురు ధరలు, బాండ్ల రాబడి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఆర్థిక రంగానికి సంబంధించి, ఒత్తిడి పరిస్థితుల్లో కూడా భారతీయ బ్యాంకులు కనీస మూలధన అవసరాలను నిర్వహించగలవని ఆయన అన్నారు.భారత్ ప్రపంచ వృద్ధికి కొత్త ఇంజన్‌గా మారేందుకు సిద్ధంగా ఉంది, మార్చి 2024తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం 6.5 శాతం జిడిపి వృద్ధి రేటును అంచనా వేస్తుందని దాస్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –