వచ్చే కార్తీక మాసంలో దేశంలో లక్షల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. కేవలం 23 రోజుల సీజన్‌లో ఏకంగా 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దీపావళి తర్వాత.. అంటే కార్తీక మాసం తులసి కల్యాణం తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. కాబట్టి మరి మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. లక్షల కోట్లలో వ్యాపారం జరుగనుంది. దాంతో వ్యాపారులు సైతం అందుకోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేసుకుంటున్నారు.
దీపావళి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్‌లో లక్షల కోట్లలో వ్యాపారం జరిగి భారీగా లాభాలు వస్తాయని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం 23 రోజులపాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది. ఈ 23 రోజుల వ్యవధిలో మొత్తం 35 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాం ఉన్నట్లు తెలుస్తోంది.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ‘క్యాట్’ పరిశోధన విభాగం (క్యాట్ రిసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ) ని ఉటంకిస్తూ ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. దేశంలోని 20 ప్రధాన నగరాల్లో వ్యాపారులు, వివాహ సేవల ప్రదాతలపై ఒక సర్వే నిర్వహించారు. ఒక్క ఢిల్లీలోనే ఈ సీజన్‌లో దాదాపు 3.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఢిల్లీలోనే ఈ 23 రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కోట్ల వ్యాపారం జరగనుంది.
గత ఏడాది ఇదే కాలంలో 32 లక్షల వివాహాలు జరిగాయి. మొత్తం వ్యాపారం రూ.3.75 లక్షల కోట్లకు చేరింది. ఈ 23 రోజుల పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.3 లక్షల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేయగా, దాదాపు 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.6 లక్షల చొప్పున ఖర్చవుతుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ తెలిపారు. అదేవిధంగా దాదాపు 12 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షలు, మరో 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 25 లక్షలు, 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.50 లక్షల చొప్పున, మరో 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుందని సీఏఐటీ అంచనాలు చెబుతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా వ్యాపారులు విస్తృతమైన సన్నాహాలు చేశారు. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి వ్యాపారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్ హౌస్‌లు, వివాహాల కోసం అనేక రకాల స్థలాలు దేశవ్యాప్తంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పెళ్లిలో ఉపకరణాల కొనుగోలుతో పాటు, టెంట్ డెకరేటర్‌లు, ఫ్లవర్ డెకరేషన్‌లు, క్రాకరీ, క్యాటరింగ్ సర్వీస్, ట్రావెల్ సర్వీస్, క్యాబ్ సర్వీస్, ప్రొఫెషనల్ గ్రూప్‌లు, కూరగాయల విక్రయాలు, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు వంటి అనేక రకాల సేవల ద్వారా వ్యాపారం జోరుగా సాగనుంది. బ్యాండ్-బాజా, షెహనాయి, ఆర్కెస్ట్రా, డీజే, ఊరేగింపు కోసం గుర్రాలు, బండ్లు, లైట్లు, అనేక ఇతర రకాల సేవల ద్వారా కూడా ఈసారి పెద్ద వ్యాపారం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా పెద్ద వ్యాపార అవకాశంగా మారిందని సర్వే నిర్వాహకులు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –