Politics

మంథనిలో పీవీ పేరు కూడా పలకని రాహుల్

మంథనిలో పీవీ పేరు కూడా పలకని రాహుల్

తెలంగాణను ఉద్ధరిస్తామని ఊరూరా తిరిగి చెప్తున్న కాంగ్రెస్‌ పెద్దలు.. తెలంగాణకు గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పట్ల చూపుతున్న చిన్నచూపు, వివక్షను చూసి తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారు. దేశాన్ని ప్రగతి బాట పట్టించి అపర మేధావిగా కీర్తి గడించిన పీవీని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా నెహ్రూ వారసులు ఎప్పుడూ చులకనగానే చూశారు. చివరకు ఆయన మరణించిన తర్వాత భౌతికకాయాన్ని కూడా చూడటానికి రాలేదంటే వారికి పీవీపట్ల ఉన్న అభిప్రాయం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం మంథనికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని పీవీ విగ్రహం వద్దే మీటింగ్‌ పెట్టి.. కనీసం ఆ విగ్రహానికి నివాళులు కూడా అర్పించలేదు. తన ప్రసంగంలో మాట వరుసకు కూడా పీవీ పేరును ప్రస్తావించలేదు.

కాంగ్రెస్‌ను బతికించిన పీవీ
దేశంలో 90 దశకంలో ప్రాంతీయపార్టీలతోపాటు బీజేపీ వంటి పార్టీలు కూడా బలం పుంజుకోవటంతో కాంగ్రెస్‌ చావు అంచుల్లో నిలబడింది. పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కరువైన ఆ సమయంలో పీవీ ముందుకొచ్చి తన మేధాశక్తి, రాజకీయ చతురతతో కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు తెచ్చారు. ఐదేండ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన హయాంలో దాదాపు పెద్దస్థాయి కాంగ్రెస్‌ నేతలంతా పదవులు అనుభవించారు. రెండుచేతులా సంపాదించుకొన్నారు. పీవీ పదవి నుంచి దిగిపోగానే ఆయనను మర్చిపోయారు. ఆ సమయంలో పీవీ లేకుంటే కాంగ్రెస్‌ అప్పుడే భూ స్థాపితం అయిపోయి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెప్తారు. అలాంటి దశనుంచి కాంగ్రెస్‌ పుంజుకొనేలా పీవీ జవసత్వాలు నింపారు. అయినా, ‘గాంధీల’ కుటుంబం ఆయనను అడుగడుగునా అవమానించింది. పార్టీలో ఏ కీలక పదవీ ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించింది. చివరకు పీవీ మరణించిన సమయంలో కూడా ఆయన పట్ల కాంగ్రెస్‌ మర్యాదగా ప్రవర్తించలేదు. ప్రధానమంత్రుల సమాధులన్నీ ఢిల్లీలోనే ఉన్నాయి. కానీ, అక్కడ పీవీ స్మారకాన్ని కట్టించేందుకు కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. పీవీ అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించకుండా అవమానించారు. పీవీ శవం సగం కాలకముందే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతే చితి ఆరిపోయిన ఫొటోలో నాడు ప్రతి తెలంగాణ బిడ్డను ఆవేదనకు గురిచేశాయి.

నేటి భారత ప్రగతికి పితామహుడు పీవీనే
దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా భారత ప్రజాస్వామ్యంలోని అన్ని పదవులు చేపట్టారు. బహుభాషా కోవిధుడు. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించగల మేధావి. నిజానికి నేడు భారతదేశంలో కనిపిస్తున్న ప్రతి ప్రగతి వెలుగుకూ పీవీనే కారణం. భారత ప్రగతికి ఆయనే పితామహుడు. పీవీ ప్రధాని పదవి చేపట్టేనాటికి నెహ్రూ కుటుంబీకుల దిక్కుమాలిన పాలనతో దేశం అప్పటికే అధోగతిపాలైంది. తిండికి కూడా లేక ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక దేశం దివాళా అంచున ఉన్నది. అలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని పదవిలోకి వచ్చి, తన మేధో శక్తితో దేశాన్ని ప్రగతి బాట పట్టించిన దార్శనికుడు పీవీ. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్‌ మర్చిపోయింది. పరమ శత్రువైనా చనిపోయిన తర్వాత వారిపట్ల ద్వేషాన్ని విడిచి గౌరవించాలన్న భారతీయ విధానం. కానీ పీవీ మరణించిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఆయనపై కోపం, చిన్నచూపు పోలేదని రాహుల్‌గాంధీ మరోసారి నిరూపించారు. రాహుల్‌గాంధీ తీరుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంథని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీని అవమానించడం కాంగ్రెస్‌ అహంకారానికి పరాకాష్ట అని పెద్దపల్లి జడ్పీచైర్‌పర్సన్‌ పుట్టా మధూకర్‌ విమర్శించారు. మంథనిలోని ఆయన విగ్రహానికి సమీపంలోనే ప్రసంగించిన రాహుల్‌గాంధీ, కనీసం నివాళులర్పించక పోవడం దారుణమని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు గుర్తింపు లేదని అన్నారు. సీఎం స్థాయి వరకు ఎదిగిన హన్మంతరావు, శ్రీనివాస్‌ను ఎదగకుండా అడ్డుకున్నారని.. పొన్నాల లక్ష్మయ్యకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ నేడు బీసీ జనగణన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణలో పీవీకి సగౌరవం…పీవీని కాంగ్రెస్‌ పార్టీ మర్చిపోయినా, తెలంగాణ ప్రభుత్వం నెత్తిన పెట్టుకొన్నది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌ నడిబొడ్డున నెక్లెస్‌ రోడ్డులో నిలువెత్తు పీవీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఆ రహదారికి పీవీ మార్గ్‌ అని పేరు పెట్టింది. అంతటితో ఆగకుండా పీవీ కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన కుటుంబాన్ని గౌరవించింది. విదేశాల్లోనూ పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించింది. కాంగ్రెస్‌ మాత్రం పీవీ తర్వాత ఆయన కుటుంబ సభ్యులను దగ్గకు కూడా రానీయలేదు. కుటుంబ వారత్వానికి కాంగ్రెస్‌ పార్టీ పెట్టింది పేరు. నెహ్రూ నుంచి ఇందిర, రాజీవ్‌, సోనియా, రాహుల్‌ వరకు కాంగ్రెస్‌ అంటే నెహ్రూ కుటుంబమే అన్నంతగా మారిపోయింది. ఆ పార్టీలోని ఇతర నేతలు కూడా తమ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్లకు పదవులు సంపాదిస్తూ పార్టీని సొంత ఆస్తిలా భావిస్తారు. కానీ, ప్రధాన పదవి నిర్వహించిన పీవీ కుటుంబాన్ని మాత్రం దగ్గకు కూడా రానీయలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z