ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి క్యాడర్ ఉన్న టీడీపీ లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా రాజ్యసభ మాజీ సభ్యుడు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు.
శుక్రవారం మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో రావుల బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన రావుల రాకతో వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల గెలుపు బాధ్యతను రావులకు అప్పగించారు.
ఎన్నికల్లో కలిసి వస్తుందని..
తెలంగాణ వచ్చాక టీడీపీలోని చాలా మంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోగా, మాజీ ఎంపీ రావులతో పాటు కొందరు ఆ పార్టీ అభిమానులు మాత్రం టీడీపీలో ఉండి పోయారు. వీరిపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వారి సహకారం తీసుకోవాలని ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ లీడర్లను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. రావుల చంద్రశేఖర్రెడ్డి దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన వారు కావడం, మక్తల్ నియోజకవర్గంలో రావుల బావమరిది పోలీసు చంద్రశేఖర్ రెడ్డి కూడా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. రావుల చేరికతో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఈజీ అవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
వనపర్తిలో రావుల, నిరంజన్ రెడ్డి కలిసి టీడీపీలో పని చేశారు. అప్పట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరంజన్ రెడ్డి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో వీరి మధ్య అప్పటి నుంచే సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎమ్మెల్యేగా కొనసాగిన రావుల ఉద్యమానికి మద్దతు ఇస్తూ తనపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. కాగా, తనకంటూ మంచి క్యాడర్, అభిమానులు, పరిచయాలు ఉండడంతో గతంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రావులను ఆహ్వానించారు.
పోటీ చేస్తానంటే తన సీటును సైతం త్యాగం చేస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో విభేదించే రావుల తాను చేరలేనంటూ చెప్పారు. అయితే రావుల రాకతో బీఆర్ఎస్ లోని అసంతృప్తులు మరో పార్టీ వైపు చూడకుండా కట్టడి చేయవచ్చని అంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వారే ఇప్పుడు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉన్నారు. సొంత పార్టీ వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీలోని వారిని ప్రభావితం చేసేలా రావుల తనవంతు ప్రయత్నం చేస్తారని అంటున్నారు.
ఇతర నియోజకవర్గాల్లోనూ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీడీపీకి ఉన్న కొద్ది పాటి క్యాడర్ ను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. కొల్లాపూర్ లో పగిడాల శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. గద్వాల, అలంపూర్, మక్తల్, అచ్చంపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల తదితర నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ జెండాలు మోసే క్యాడర్ ఉంది. టీడీపీలో కీలక లీడర్లను తమవైపు తిప్పుకుంటే ఆ ఓట్లు బీఆర్ఎస్ కు పడతాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడడంతో ఆ పార్టీ లీడర్లు సైతం ప్రాధాన్యత కల్పించే పార్టీ వైపు చూస్తున్నారు. ఎలక్షన్ల టైం అయితేనే తమకు తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నారు. కేసీఆర్ సైతం టీడీపీ ఓటు బ్యాంక్ పై దృష్టి పెట్టారని, అది కాంగ్రెస్ ఖాతాలోకి బదిలీ కాకుండా చూడాలని ఎమ్మెల్యేలను ఆదేశించడంతో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ ఎన్నికల్లో ఏ అవకాశాన్ని వదులుకోవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.
ప్రతిపక్షాల నజర్..
కాంగ్రెస్, బీజేపీ లీడర్లు కూడా టీడీపీ నాయకులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. టీడీపీలో పెద్ద ఎత్తున బీసీలు లీడర్లుగా ఎదిగారు. అప్పట్లో ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, ఎమ్మెల్యేలుగా బీసీలే ఎక్కువగా ఉండడంతో ఆయా కుల సంఘాల్లోనూ టీడీపీకి అభిమానులున్నారు. వీరి ఓట్లు కీలకంగా మారనుండడంతో టీడీపీ నేతలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
👉 – Please join our whatsapp channel here –