* బీఆర్‌ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు(ఉచిత గుర్తులు) విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బీఆర్‌ఎస్ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్‌ఎస్ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించారు. ఇక, ఎన్నికల్లో ఈ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యారు. ఒక రకంగా బీఆర్‌ఎస్ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
* ఐఏఎస్ అధికారి పై రాజధాని రైతుల ఫిర్యాదు
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి రాజధాని రైతులు షాక్ ఇచ్చారు. మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించడంలేదని రాజధాని రైతులు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తీరును నిరసిస్తూ రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును ఇప్పటి వరకు చెల్లించలేదని రైతులు ఆరోపించారు. మొత్తం 22,948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు కౌలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదని ఆరోపించారు. సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
* దోశలు వేసిన రాహుల్
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్ 20న జగిత్యాలలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మాల్యాల మీదుగా వెళ్లిన రాహుల్ మండలంలోని వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆగి టిఫిన్ చేశారు. కాసేపు చిన్నారులతో కాలక్షేపం చేసి వారికి చాక్లెట్స్ ఇచ్చారు అటుగా వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. అలాగే కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ వెంకటేశ్వర ఫుడ్ ట్రక్ బండి దగ్గరకు వెళ్లి కాసేపు దోశలు వేశారు రాహుల్. ఇద్దరు కస్టమర్లకు కూడా రాహుల్ దోశ వేసి ఇచ్చారు. ఆయన వెంట రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, శ్రీధర్ బాబు, తదితరులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా, దోస రుచి చూసిన రాహుల్ బాగుందనడంతో ఫుడ్ ట్రక్ ఓనర్ సంతోషం వ్యక్తం చేశారు.
* కాంగ్రెస్ పార్టీకి మరోషాక్
కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు చెరుకు సుధాకర్. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు చెరకు సుధాకర్. అంతేకాదు.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు చెరకు సుధాకర్. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు చెరకు సుధాకర్.ఇక అటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అంబర్‌పేట శంకర్. మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు అంబర్‌పేట శంకర్. ఇక అటు మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు చేరారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు.
* కొడాలినాని కారుకి ప్రమాదం
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలినాని కాన్వాయికి ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం కొడాలి నాని కుటుంబ సమేతంగా వచ్చారు. దర్శనానంతరం తిరిగి వెళ్లే సమయంలో వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బారికేడ్ ను కొడాలి నాని కారు ఢీ కొట్టింది. అయితే ఇది స్వల్ప ప్రమాదమే అని తెలుస్తోంది.ప్రమాద సమయంలో ఆ కారులో కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతోనే ఇది చిన్న ప్రమాదంతో ముగిసిపోయిందని…పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత కొడాలి నాని అదే కారులో వెళ్లారని అంటున్నారు.ప్రమాదం విషయం తెలియడంతో విజయవాడకు చెందిన వైసిపి నేతలు, కొడాలి నాని వీరాభిమానులు ఫోన్ చేసి వివరాలు అడిగి, పరామర్శిస్తున్నారు. గురువారం నాడు కొడాలినాని ఇంట్లో ఆయన మేనకోడలి పెళ్లి వేడుక జరిగింది. ఈ శుభకార్యం కోసం బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా హాజరయ్యారు. బంధువుల మధ్య ఎంతో సంతోషంగా గడిపిన మరుసటి రోజూ ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించింది. కానీ, చిన్న ప్రమాదంతో పోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ కొన్ని గద్దలు, తోడేళ్లు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.‘‘ఆనాడు రాష్ట్రం వద్దన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి పైసలు పంచను ప్రమాణం చేయాలని కేసీఆర్‌ను రమ్మని చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని అనలేదా?. పైసల కట్టెలతో దొరికిన దొంగ రేవంత్. తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి జరుగుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది?. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఎక్కడివి?. తొమ్మిదిన్నరేళ్లలో సంక్షేమం ఒక వైపు అభివృద్ది మరోవైపు. అజ్ఞానులు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మేము ఎవరికి బీ టీమ్ కాదు. పార్లమెంట్‌లో కన్నుకొట్టి, కౌగిలించుకొని ఇక్కడేమో మనల్ని అంటున్నారు. సోనియా గాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు నిప్పు అయ్యింది, బలి దేవత కాళి దేవత అయ్యిందా?’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
* కేసీఆర్ పాటని ఆవిష్కరించిన కేటీఆర్
నంది అవార్డు గ్రహీత, న్యాయవాది లక్ష్మణ్ గంగరాసి(Laxman Gangarasi) రాసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్(Minister KTR) విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాతూ..బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాది, లక్ష్మణ్ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలన్నారు.ఈ పాటకి నిర్మాతగా వ్యవహరించిన హైకోర్టు అడ్వకేట్ పత్తి ప్రవీణ్ కుమార్, దర్శకుడు అభిలాష్ సీఎచ్, సంగీతం దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ చెన్నూరి శివకుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ రావు చెంగల్వ, హైకోర్టు న్యాయవాదులు జి.వేణుగోపాల్ రావు, ఎమ్.వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
* చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. నవంబర్ 1 నుంచి జగనన్నే మరలా ఎందుకు సీఎం కావాలి అనే దానిపై రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని.. అనంతరం గ్రామంలోని పార్టీ ప్రతినిధులపై ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.ఇక, రెండో రోజు గ్రామస్తులకు కరపత్రాల పంపిణీ చేయాలి.. మిగిలిన రోజుల్లో మండలస్థాయి నాయకులు వెళ్ళాలి.. జనవరి మొదటి నుంచి పింఛన్ల పెంపుపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నాం.. ఫిబ్రవరిలో చేయూత, మార్చిలో వైస్సార్ ఆసరా కార్యక్రమాలు ఉంటాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలను వివరించారు వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. జగనన్న పేరు చెబితే చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఉచ్చ పోసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హాయాంలో వీళ్లిద్దరూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 2024లో మీ ముఖ్యమంత్రి ఎవరో టీడీపీ నాయకులు ఇప్పుడే చెప్పగలరా? ఒంటరిగా పోటీ చేసే దమ్ములేని పార్టీ టీడీపీ అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే గణేష్.
👉 – Please join our whatsapp channel here –