జైలు శిక్షను రద్దుచేయాలని కోరుతూ ప్రముఖ సినీ నటి జయప్రద దాఖలు చేసిన అప్పీల్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. 15 రోజుల్లో కోర్టులో లొంగిపోయి, రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జయప్రద చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి అన్నాసాలైలో ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. విచారించిన కోర్టు జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా చొప్పున విధిస్తూ ఆగస్టులో తీర్పునిచ్చింది. దీనిపై ఆమె మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌ను కిందటిసారి విచారించిన న్యాయమూర్తి ఈఎస్‌ఐకి చెల్లించాల్సిన రూ.37.68 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా అనే విషయంపై జయప్రద వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రూ. 20 లక్షలు చెల్లిస్తామని ఆమె చెప్పారు. దీనిని ఈఎస్‌ఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. జయప్రద తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేశారు.
👉 – Please join our whatsapp channel here –