దుర్గాదేవిని ఆరాధించే దసరా పండుగ భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. హిందువుల జనాభా గణనీయంగా ఉండే నేపాల్, భూటాన్, మారిషస్, మలేసియా, ఇండోనేసియా, కంబోడియా వంటి దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు ఏటా ఘనంగా జరుగుతాయి. మన పొరుగునే ఉన్న నేపాల్లోనైతే దసరా నవరాత్రులే అతిపెద్ద వేడుకలు. నేపాల్లో ఈ వేడుకలను ‘దశైన్’ అంటారు. నవరాత్రి వేడుకలను నేపాలీలు దాదాపు మనలానే జరుపుకుంటారు. అయితే, వారికి కొన్ని విలక్షణమైనా ఆచారాలూ ఉన్నాయి. చివరి రోజైన దశమి నాడు వయసులో చిన్నవాళ్లంతా తప్పనిసరిగా పెద్దలను కలుసుకుంటారు. పెద్దలు వారి నుదుట తిలకం దిద్ది, ‘ఝమరా’ (ఒకరకం గరిక) ఆకులను వారి చేతికి ఇచ్చి, ఆశీస్సులు అందజేస్తారు.ఈ ఆకులనే చెవిలో ధరిస్తారు. నేపాల్లోని శక్తి ఆలయాల్లో నవరాత్రుల సందర్భంగా తాంత్రిక పూజలూ, జంతుబలులూ జరుగుతాయి. నేపాల్తో పోల్చుకుంటే, భూటాన్లో హిందువుల సంఖ్య తక్కువే అయినా, అక్కడ కూడా దసరా నవరాత్రులు ఘనంగానే జరుగుతాయి. ఈ వేడుకల్లో అన్ని వర్గాల వారు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొంటారు. మారిషస్, మలేసియా, కంబోడియా దేశాలలోనూ అక్కడి హిందువులు దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకొంటారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు వంటివి కూడా ఏర్పాటవుతాయి. ఇండోనేసియాలోని బాలి దీవిలో ఆలయాలన్నీ నవరాత్రి వేడుకల్లో భక్తుల సందడితో కళకళలాడుతాయి. ఈ ఇరుగు పొరుగు దేశాల్లోనే కాదు, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి సుదూర పాశ్చాత్య దేశాల్లోనూ అక్కడ స్థిరపడ్డ హిందువులు నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.
👉 – Please join our whatsapp channel here –