తెలంగాణ రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’.. క్రమంగా ఇది అంతరించిపోయే జాబితాలో చేరుతోందని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 30 శాతం మేర వాటి సంఖ్య తగ్గినట్లు ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక చెబుతోంది. విజయదశమి రోజున పాలపిట్టను ప్రదర్శించి నగదు చేసుకునేందుకు కొందరు వీటిని బంధిస్తుండడంతో.. డీహైడ్రేషన్ తదితర సమస్యలతో మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.200కి పడిపోయిన సంఖ్య: హైదరాబాద్‌లో పక్షుల లెక్కలు గణించే సంస్థల ప్రకారం గ్రేటర్ పరిధిలో గతేడాది 300కు పైగా పాలపిట్టలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 200కు పడిపోవడంతోపాటు అరుదుగానూ కనిపిస్తున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దసరా రోజున పాలపిట్ట కనిపిస్తే మంచి జరుగుతుందని ఎంతోమంది నమ్ముతుంటారు. ఈ విశ్వాసాన్ని అడ్డుపెట్టుకొని శివారు ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు వీటిని బంధించి ప్రదర్శిస్తున్నారు. ఆహారం, నీరు ఇవ్వకపోవడంతో.. అవి బలహీనపడి మరణిస్తున్నాయని బర్డింగ్‌పల్ ప్రతినిధి హరికృష్ణ చెబుతున్నారు. పాలపిట్ట అటవీచట్టం పరిధిలోకి వస్తుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్-4లో ఉండటంతో వాటిని బంధించడం, హింసించడం తదితర చర్యలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. మూడేళ్ల జైలుశిక్ష లేదా రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –