DailyDose

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు- నేర వార్తలు

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు- నేర వార్తలు

* హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన యజమాని వద్ద 3 కోట్ల రూపాయలు పోలీసులు సీజ్ చేయడంతో అధికారులు సదరు సంస్థపై ఫోకస్ పెట్టారు. అయితే కర్నాటక నుంచి డబ్బులు తరలిస్తున్న ఆ సంస్థ యజమానిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న 3 కోట్ల రూపాయలను ఐటీ శాఖకు అప్పగించారు. దీంతో ఆ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా డెవలపర్స్, ఇతర వ్యాపారాలపై ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజుల నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో రెండ్రోజుల పాటు ఐటీ అధికారులు కొనసాగుతాయని సమాచారం.

* ఢిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఢిల్లీ నుండి జార్ఖండ్ వెళ్తుండగా.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గుర్తు తెలియని ఓ వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహ అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* మొబైల్‌ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్‌ ఫోన్‌ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్‌ ఫోన్‌ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఘటన జరిగిన వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. అక్టోబర్ 8న ఈ జిల్లాలోని కోలాహల్ గ్రామంలో ‘మహాగణపతి శోభ యాత్ర’ సందర్భంగా యశ్వంత్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడని, ఆ తర్వాత కొత్త ఫోన్ కొనమని తాతను కోరాడని పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్లి పంట వచ్చిన తర్వాత కొత్త సెల్‌ఫోన్ ఇప్పిస్తానని ఆ యువకుడికి తాత హామీ ఇచ్చాడు. అయితే అక్టోబరు 18న ఆ బాలుడు తనకు వెంటనే కొత్త మొబైల్ ఫోన్ కొనాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు తాత నిరాకరించడంతో విషం తాగాడు. ఘటన జరిగిన వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, తదుపరి చికిత్స కోసం దావణగెరె జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా గురువారం మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొన్నాళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో యశ్వంత్ తల్లి, తాతయ్యలతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. అతను వ్యవసాయంలో వారికి సహాయం చేసేవాడని అధికారి చెప్పారు.

* పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, జైష్‌ ఏ మహ్మద్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు అత్యంత సన్నిహితుడు, లష్కర్‌ ఏ జబ్బార్‌ వ్యవస్థాపకుడు దావూద్‌ మాలిక్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌ దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ముసుగులు ధరించిన వ్యక్తులు అతనిపై కాల్పులు జరుపడంతో ప్రాణాలు కోల్పోయాడు. దావూద్‌ మాలిక్‌ ఓ ప్రైవేట్‌ క్లినికల్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పారిపోయారని తెలస్తున్నది. ఇదిలా ఉండగా.. భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో ఇటీవల పాక్‌లో హత్యకు గురవుతున్నారు.ఇప్పటికే పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌తో పాటు ఐఎస్‌ఐ ఏజెంట్‌ ముల్లా బహూర్‌ అలియాస్‌ హోర్ముజ్‌పై కాల్పులు మృతి చెందారు. తాజా లతీఫ్‌కు అత్యంత సన్నిహితుడైన దావూద్‌ మాలిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దావూద్ మాలిక్‌కు లష్కరే జాంగ్వీలతో సంబంధాలున్నాయి. మసూద్ అజార్, హఫీజ్ సయీద్, లఖ్వీ, దావూద్ ఇబ్రహీంతో పలువురిని భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌పై భారత సైన్యం వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దావూద్‌ మాలిక్‌ అక్కడే ఉన్నాడు. దాడి నుంచి తప్పించుకున్నట్లు తర్వాత తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్‌ ఐఎస్‌ఐ రక్షణ కల్పిస్తున్నట్లుగా విమర్శలున్నాయి.

* ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. కోయలిబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సమయంలో రాష్ట్ర పోలీసు దళానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కు బయలుదేరింది.ఈ క్రమంలో నక్సలైట్లు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఇద్దరు పురుష నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ ‘పీటీఐ’తో తెలిపారు.ఇదే రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గత నెల 5వ తేదీన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉన్న ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్మెట్ల, దులేద్ గ్రామాల మధ్య అడవిలో ఉదయం 6 గంటల సమయంలో వివిధ భద్రతా దళాలకు చెందిన జాయింట్ టీమ్ నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. అయితే ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి.

* ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య

ఛత్తీస్‌గఢ్‌‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ దారుణం జరిగింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్‌పూర్ జిల్లా అంబాగర్ చౌకీ పట్టణంలో బీజేపీ నేత బిర్జు తారామ్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి బిర్జు తారామ్ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు అగంతకులు 3 రౌండ్ల కాల్పులు జరిపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది మావోయిస్టులే అని ఇప్పుడే చెప్పలేమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రత్న సింగ్ చెప్పారు.కాగా మోహ్లా-మన్‌పూర్‌తో పాటు మరో 19 ఇతర నియోజకవర్గాల్లో వచ్చే నెల 7న తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఛత్తీస్ ఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో స్పందిస్తూ ఇది టార్గెట్ మర్డర్ అని అరోపించారు. బీజేపీ కార్యకర్తలను ఈ దాడితో అణిచివేయాలని చూస్తే అది జరగని పని అన్నారు.

* తెలంగాణలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

తెలంగాణలో ఎన్నికల దృష్యా అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. తెలంగాణలో నిన్న రాత్రి వరకు మొత్తం 286.74 కోట్ల విలువైన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇబ్రహీపట్నంలో తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 2 కోట్ల విలువైన బంగారం, డైమండ్ ఆభరణాలను పోలీసులు సీజ్‌ చేశారు.

* ఐమాక్స్ లో అర్థరాత్రి గందరగోళం

హైదరాబాద్ లోని ఐమాక్స్ లో శుక్రవారం అర్ధరాత్రి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ? ఐమాక్స్ లోని ఓ స్క్రీన్ లో ‘గణపత్’ సినిమా ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.15 గంటల చివరి షో వేశారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు టిక్కెట్లు తీసుకొని లోపలికి ప్రవేశించారు. సినిమా మొదలైన కొంత సమయం తరువాత థియేటర్ లోకి ఆకస్మాత్తుగా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుర్వాసన రాకుండా స్ప్రే చేస్తామని ప్రేక్షకులకు చెప్పారు.కానీ దుర్వాసన తగ్గలేదు. అరగంట దాటినప్పటికీ అలాగే కొనసాగింది. దీంతో ప్రేక్షకులకు కోపం ఎక్కువయ్యింది. కోపంతో అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. టికెట్ కు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ థియేటర్ సిబ్బందితో ఆందోళనకు దిగారు. ఈ విషయం పోలీసుల వరకు చేరింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రేక్షకులతో, థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో టిక్కెట్టు డబ్బులు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z