DailyDose

రాహుల్ పై కవిత సెటైర్లు- తాజా వార్తలు

రాహుల్ పై కవిత సెటైర్లు- తాజా వార్తలు

రాహుల్ పై కవిత సెటైర్లు

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు..కేవలం పేపర్ టైగర్ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ పట్ల రాహుల్ కు అవగాహన లేదన్నారు. కేవలం కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవడం కాకుండా.. పరిస్థితుల పట్ల అవగాహన తెచ్చుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. రాహుల్ కు తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహన లేదన్నారు. రాహుల్ మళ్లీ ఎప్పుడైనా తెలంగాణకు వచ్చినప్పుడు దోశ బండి వద్ద దోశలు వేసుకుని తినడమే కాదు.. అమరుల కుటుంబాలను కలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత ఏంటదనేది తెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత.

33 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ లిస్ట్‌ రిలీజ్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నాయి. సర్వేలు, విజయవకాశాలు, ఇతర ఈక్వేషన్స్ అన్నింటిని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇక, ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 33 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.పార్టీలోని కీలక నేతలకు ఈ ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సదర్‌పురా నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ టోంక్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. మరో కీలక నేత సీపీ జోషి నథ్వారా సెగ్మెంట్ నుండి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రతిపక్ష బీజేపీ సైతం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఇవాళే విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన బీజేపీ.. శనివారం 83 మందితో సెకండ్ లిస్ట్‌ను విడుదల రిలీజ్ చేసింది. సెకండ్ లిస్ట్‌లో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజేకు చోటు దక్కింది.

సిలికాన్‌ సిటీలో ట్రాఫిక్‌ కష్టాలు

సిలికాన్‌ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇక సెలవుల సమయంలో చెప్పాల్సిన పనేలేదు. సొంతూళ్లకు వెళ్లే నగర వాసులు సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో మహానగరం మొత్తం ఎక్కిడకక్కడ స్తంభించిపోతుంటుంది.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్లపై బైక్‌పై వెళ్తూ ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న (Woman Working On Laptop) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. బైక్‌పై వెనుక కూర్చున్న యువతి ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసుకుని తన పనిచేసుకుంటూ కనిపించింది. ఈ వీడియో రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోకు ‘బెంగళూరులో మాత్రమే ఇలా..’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

*  బీజేపీకి షాక్

32 వ డివిజన్ కు చెందిన బీజేపీ డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఒంటెల ప్రసాద్ శనివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రసాద్ ను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తనది అని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రసాద్ మాట్లాడుతూ వరంగల్ ఎమ్మెల్యే నరేందర్ చేపడుతున్న అభివృద్ధికి చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

*   హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్‌, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి ఈనెల 18న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్‌ నరేందర్‌ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

జగనన్న ఆరోగ్య సురక్ష రికార్డు

 ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం.. టెస్ట్‌లు చేయడం.. అక్కడే మందులు ఇవ్వడం.. ఇలా ప్రజల అనారోగ్య సమస్యలపై ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజ­యవంతంగా కొనసాగుతోంది.. అయితే, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఉచిత వైద్య పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఇప్పటివరకు వరకు 9,105 వైద్య శిబిరాలను నిర్వహించారు.. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ శిబిరాలకు ఇప్పటి వరకు 41 లక్షల మంది హాజరయ్యారు.. వీరిలో ఉచితంగా వైద్యులను సంప్రదించనవారు 39.5 లక్షల మంది..ఇక ఇంటి వద్దే నిర్వహించిన రాపిడ్ పరీక్షలు 6.14 కోట్లకు పైగా ఉన్నాయి.. ఇప్పటి వరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నవారు సంఖ్య 3.63 కోట్లకు పైగా ఉంది.. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్‌ ప్రకారం ఈ వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పె­షలిస్ట్‌ వైద్యుల సేవలను పొందుతున్నారు.. ఇక, వైద్యులు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

అసెంబ్లీ బరిలో తాను ఉంటానని గద్దర్ కుమార్తె  స్పష్టం 

ఈసారి తెలంగాణ అసెంబ్లీ బరిలో తాను ఉంటానని దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తున్నట్టు వెన్నెల తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ లిస్ట్ లో తన పేరును ప్రస్తావించినట్టు తెలిసిందని.. తనకు అవకాశం ఉంటుందని వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులను మల్లారెడ్డి సవాల్‌ 

కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపిస్తానని సవాల్‌ చేశారు మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్‌ పార్టీ అంటే చరిత్ర.. కేసీఆర్‌ సీఎం అయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్‌ కొత్తగా 10 పథకాలు తీసుకువచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెట్టారు.కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ.. భూకబ్జా దారులు.. వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే.. దళితులకు భూములను పంచే బాధ్యత నాదేనని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రాహుల్ గాంధీ ఒక పప్పు.. ఆయనకు ఫేస్ వాల్యూ లేదు..కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలి.? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మొత్తం స్కాంలే.. రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రచారం చేసే అర్హత లేదు..కాంగ్రెస్ ఏం చేసిన అధికారంలోకి రాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరేం చేశారు అనేది తెలుసు అని.. బీజేపీ వాళ్లు గతంలో కూడా పోటీ చేశారు.. ఓడిపోయారని పేర్కొన్నారు. ఈటల హుజురాబాద్ లో ఓడిపోతున్నాడు.. అందుకే కెసిఆర్ పైన పోటీ అంటున్నాడని ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z