Politics

నీతి నిజాయితీయే చంద్రబాబు ఆయుధం: లోకేష్

నీతి నిజాయితీయే చంద్రబాబు ఆయుధం: లోకేష్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నీతి నిజాయితీయే చంద్రబాబు ఆయుధం అని చెప్పారు. రాష్ట్ర ప్ర‌గ‌తి-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు ప్ర‌క‌ట‌న‌ అన్నారు. మంగళగరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో భావోద్వేగానికి లోనైన లోకేష్.. సమావేశ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల కోసం పోరాడారని లోకేష్ అన్నారు.

తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని లోకేష్ చెప్పారు. తన తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారని అన్నారు. తన తల్లి రాజకీయంగా ఏనాడైనా బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు. తన తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప..రాజకీయాలు తెలియదని అన్నారు. తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలు కలిసి చంద్రబాబు నాయుడును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి, భార్యలు చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏ అని విమర్శించారు.

ప్ర‌జ‌ల త‌ర‌ఫున శాంతియుతంగా పోరాడాల‌ని చంద్రబాబు చెప్పారని లోకేష్ తెలిపారు. త్వ‌ర‌లో భువ‌న‌మ్మ “నిజం గెల‌వాలి“ కార్య‌క్ర‌మం చేపడతామని చెప్పారు. న‌వంబ‌ర్ 1 నుంచి బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ పునః ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కొస్తారని.. అనంత‌రం యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌ల‌వుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 160 సీట్లు గెల‌వ‌బోతోందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ గతంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని చెప్పారు. చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేసి నేటికి 43 రోజులు అని అన్నారు. ఇది క‌ల‌లో కూడా ఊహించ‌నిదని.. త‌ల‌చుకుంటేనే దుఃఖం త‌న్నుకొస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ ఆగిపోతుందని అనుకున్నారని.. అయితే భయం అనేది తమ బయోడేటాలో లేదని చెప్పారు. గతంలో ఇందిరా గాంధీనే లెక్క చేయలేదని.. అలాంటిది జగన్‌ను లెక్క చేస్తామా? అని అన్నారు. చంద్ర‌బాబుకి మద్ద‌తుగా రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉద్యమాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలు, విదేశాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు.
చంద్రబాబు అరెస్టుతో తీవ్ర ఆందోళ‌న‌కి గురై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో 157 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. ఆ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని.. వారి కుటుంబాలను ఆదుకుంటుందని చెప్పారు. జగన్ కేంద్రం మెడలు వంచుతాడని, రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాడని ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చారని అన్నారు. అయితే జగన్ ఒక రోడ్డు వేయలేదని, ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదని ఆరోపించారు. కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కు కోల్పోతుంటే పట్టించుకోరని విమర్శించారు.

జగన్ సీఎం అయిన తొలిరోజు నుంచే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. కక్ష సాధింపు చర్యలే అజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని.. తనపై కూడా తప్పుడు కేసులు బనాయించాడని విమర్శించారు. చంద్రబాబు కార్యచరణను ముందుకు తీసుకెళ్లడమే తమ ముందు ఉన్న బాధ్యత అని చెప్పారు. చంద్రబాబును, ఆయన కుటుంబ సబ్యులను వేధించడమే జగన్ అజెండా అని మండిపడ్డారు. టీడీపీ, జనసేన మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సైకో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉందని… ప్ర‌జ‌ల్లోకి వెళ‌దాం,..ప్ర‌జాచైత‌న్యం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z