రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పూలపండుగ ఉత్సవాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. అటుకుల, ముద్దపప్పు, నానెబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయ, వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సచివాలయం, రాజ్‌భవన్ తదితర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ నిర్వహించారు. సద్దుల బతుకమ్మను అన్ని జిల్లాలు, మండలాలు, పురపాలికలు, గ్రామాల్లో జరపనున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రోజులుగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆదివారం తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో కవిత పాల్గొననున్నారు.
ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సబ్బండ వర్గాలు సమష్టిగా జరుపుకొనే బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైంది. ఇది ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగ. దేవీదేవతలను అర్చించే పువ్వులే.. బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతిపై ఉన్న ఆరాధన, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుంది. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలి’ అని సీఎం ఆకాంక్షించారు.
👉 – Please join our whatsapp channel here –